Breaking News

ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కే ఆర్ ఆర్సి ఎస్డిసి శ్రీదేవి, ఆర్డిఓ స్వాతి లతో కలిసి మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంతో ఓపికగా ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. మచిలీపట్నం మండలం చిరవీర పాలెంకు చెందిన దివ్యాంగులు సిహెచ్ రాఘవేంద్ర మూడు చక్రాల వాహనంలో అర్జీ పట్టుకుని రాగా జిల్లా కలెక్టర్ నేరుగా అతని వద్దకే వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అతని నుండి లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరడంతో వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఉగాది రోజున పి -4 సర్వే వివరాలను ఆవిష్కరిస్తున్నారని ఆలోగా సర్వే వేగవంతం చేసి పూర్తి చేయాలని మండల స్థాయిలో అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం( ఈ హెచ్ ఎస్) వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని, ఇంకా చాలామంది
ఉద్యోగులు అందులో చేరలేదని వారందరూ పథకంలో చేరేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో ఇంకా చాలామంది జిల్లా అధికారులు సభ్యులుగా చేరలేదని, చేరని వారంతా వెంటనే చేరాలన్నారు. ఇంకా చాలామంది జిల్లా అధికారులు ఈ ఆఫీసు లాగిన్ గ్రూప్గా లేదని వచ్చే వారంలోగా తప్పనిసరిగా దాన్ని సిద్ధం చేసుకోవాలని లేనిపక్షంలో షోకాస్ నోటీస్ జారీ చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, సంతృప్త స్థాయిలో జిల్లా చాలా వెనుకబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఐవిఆర్ఎస్ ద్వారా జిల్లాల పరిస్థితిని తెలుసుకుంటున్నారని ఇకనైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లా ముందంజలో నడిచేందుకు కృషి చేయాలన్నారు. అర్జీదారులకు సరైన ఎండార్స్మెంట్ తో రిజిస్టర్ పోస్టులో కానీ, నేరుగా కానీ తప్పనిసరిగా అందజేయాలన్నారు
ఈ సందర్భంగా కలెక్టరేట్లో మొత్తం 142 అర్జీలు అందగా వాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి చెందిన తుంగ మురళీకృష్ణ తమ గ్రామ పంచాయితీ పరిధిలోని రక్షిత మంచినీటి పథకానికి 40 సంవత్సరాల క్రితం సిమెంట్ పైపులు వేయడం జరిగిందని, వాటికి మరమ్మతులు రావడం జరుగుతుందని, వర్షాకాలంలో పైపుల్లోకి మురుగునీరు చేరి కుళాయి నీరు కలుషితం అవుతుందని ప్రతి ఇంటికి నీరు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నామని కొత్త ఫిల్టర్ బెడ్ లు ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి బచ్చు గదాధర్ మాట్లాడుతూ నడకుదురు గ్రామపంచాయతీ కార్యదర్శి గతంలో అవనిగడ్డ గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేసినప్పుడు గ్రామపంచాయతీ రికార్డుల్లో పలు తప్పుడు బిల్లులను సృష్టించి పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని విజిలెన్స్ విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
మొవ్వ మండలం చిన్నముతేవి గ్రామవాసి కూనపు రెడ్డి జయలక్ష్మి తన పేరు మీద ఉన్న మాగాని భూమి 50 సెంట్లు డిసిసి బ్యాంకు శాఖకు అనుసంధానమైన చిన్న ముత్తేవి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు పాడి గేదెలు కోసం 2018 సంవత్సరంలో రుణం తీసుకోవడం జరిగిందని ఆ రుణం మొత్తం బ్యాంకు వారికి చెల్లించినప్పటికీ వారు తమ పొలానికి సంబంధించిన పాసుపుస్తకాలు, దస్తావేజులు ఇవ్వకుండా 4 సంవత్సరాల నుండి చుట్టూ తిప్పించుకుంటున్నారని వాటిని ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు

మండల కేంద్రమైన గూడూరు చెందిన కొలుసు నాగవల్లిక తనకు 108 అంబులెన్స్ వాహనంలో పాప పుట్టి ఒకటిన్నర సంవత్సరం అయిందని జనన ధ్రువీకరణ పత్రం కోసం సంవత్సరం నుండి తిరుగుతున్నామని ఆ పత్రం ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు.

ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన దోప్పలపూడి రాఘవేంద్రరావు మాట్లాడుతూ తనకు గ్రామకంఠం సర్వే నంబరు 195/100 లో తాత గారి పేరున మూడు సెంట్లు స్థలం ఉందని, దాని పక్కన నివాసం ఉంటున్న నెరుసు నాగరాజు ఆ స్థలమంతా ఆక్రమించుకొని తన స్థలంగా చెబుతున్నారని ఈ విషయమై సర్వే చేయించాలని ఉయ్యూరు తహసిల్దారుకు అర్జీ పెట్టుకోగా వీఆర్వో వచ్చినా సర్వే చేయలేదని ఎంత ప్రయత్నం చేసిన ఎవరూ పట్టించుకోవడంలేదని తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన పిన్నింటి మహాలక్ష్మి తనకు కృత్తి వెన్ను గ్రామంలో 2 ఎకరాల భూమి ఉందని 336/2 సర్వే నంబర్లో 1.16 సెంట్లు భూమిలో 0.20 సెంట్ల భూమి ఆన్లైన్లో అడంగల్ లో చూపించడం లేదని, తన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్, పాస్ పుస్తకము, శిస్తు రసీదులు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి ఆన్లైన్తో పాటు అడంగల్ లో వచ్చే విధంగా చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.

మచిలీపట్నం మండలం పాత పల్లి తుమ్మ పాలెం గ్రామానికి చెందిన చాలంచలం కొండయ్య మరి కొంతమంది గ్రామస్తులు తాము యానాది కులస్తులమని గత 20 సంవత్సరాలుగా తాటాకుల పాకలు వేసుకుని 25 కుటుంబాలు సముద్రం అంచున మడ అడవుల్లో పీతలు పట్టుకొని జీవనం సాగిస్తున్నామని, ఈనెల 9 వ తేదీన విశ్వనాథ పల్లి నాగేశ్వరమ్మ వారి బంధువులతో వచ్చి తమపై దాడి చేసి పాకలు పీకి వేసి బెదిరించారని తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు

ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ప్రైవేట్ కార్యాలయాల్లో చట్ట ప్రకారం శ్రామిక మహిళా లైంగిక వేధింపుల నిరోధక కమిటీతో పాటు కమిటీ సభ్యుల పేర్లు నోటీస్ బోర్డులో ఏర్పాటు చేయాలని కోరుతూ శ్రామిక మహిళా కృష్ణా జిల్లా కన్వీనర్ పి ధనశ్రీ కోరుతూ వినతిపత్రం అందజేశారు

ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ కన్నమ నాయుడు, డ్వామా, డి ఆర్ డి ఏ పీడీలు శివప్రసాద్ యాదవ్, హరిహరనాథ్, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణారావు, డిఎస్ఓ పార్వతి, డిపిఓ అరుణ, ఆర్డబ్ల్యూఎస్,ఆర్ అండ్ బి అధికారులు నటరాజు, లోకేష్, డి ఎం హెచ్ ఓ డా. శర్మిష్ట, ఐ సి డి ఎస్ పిడి ఎంఎన్ రాణి, బీసీ సంక్షేమ ,అధికారి రమేష్, సర్వే భూ రికార్డుల ఏడి జోషిలా తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *