మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం నుండి జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు, క్షేత్రాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటల నుండి 145 కేంద్రాలలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. బాలిక విద్యార్థులను తనిఖీ చేసేందుకు కొన్నిచోట్ల మహిళా పోలీసులు కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీంతో సచివాలయం పరిధిలో పనిచేస్తున్న మహిళ పోలీసుల సేవలను పరీక్షా కేంద్రాల్లో ఉదయం కొంతసేపు వినియోగించుకోవాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లను అనుమతించరాదని అప్పుడే పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించగలరని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులకు నిబంధనలు కచ్చితంగా తెలియజేయాలన్నారు. ప్రశ్నాపత్రాలను ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిని పద్ధతి ప్రకారం చెత్త బుట్టలో వేసే లాగా సూచించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో డిఇఓ రామారావు, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిశీలకులు కృష్ణమోహన్, పలువురు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్హెచ్వోలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News