Breaking News

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటా…

-చంద్రబాబు తాత్సారం వీడాలి
-బాధితులకు సత్వర న్యాయం చేయాలి
-సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ
-ఆరు మాసాల కాల పరిమితితో పరిష్కరించాలి : ముప్పాళ్ళ
-ప్రత్యేక కమిటీని, పాస్టాగ్‌ కోర్టును నియమించాలి : వి.తిరుపతిరావు
-బాధితుల కన్నీటి దీక్షకు మద్దతు తెలిపిన నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్‌ కంపెనీ ఆర్థిక మోసాలకు బలైన బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ప్రకటించారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన బుధవారం విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇవి నాయుడు అధ్యక్షతన జరిగిన అగ్రిగోల్డ్‌ బాధితుల అసోసియేషన్‌ బాధితుల కన్నీటి దీక్షకు డాక్టర్‌ కె నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితులు న్యాయం కోరుతూ చేస్తున్న ఈ దీక్ష, కన్నీటి దీక్ష కాదని, 10 సంవత్సరాల రక్త కన్నీటి దీక్ష అని అభివర్ణించారు. దశాబ్దకాలంగా బాధితులకు అండగా ఉంటూ ముప్పాళ్ళ చేస్తున్న కృషిని ఈసందర్భంగా ఆయన అభినందించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇకనైనా తాత్సారం చేయకుండా యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తూ వందల కోట్ల అప్పులను 10 కోట్లతో సెటిల్‌మెంట్‌ చేస్తున్నారని, విజయ్‌ మాల్యా తప్ప మిగిలిన 28 మంది ఆర్థిక నేరగాళ్లు అందరూ మోదీ శిష్యులేనంటూ… వారు విదేశాలకు పారిపోవడానికి ప్రభుత్వ పెద్దలే అండగా నిలిచారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ రూ.16 లక్షల కోట్లు ఎన్‌ పి ఏ ప్రకటించి నేరగాళ్ళకు అండగా నిలబడి వారికి లబ్ది చేకూర్చిందన్నారు. ఇదంతా నరేంద్ర మోదీ ఖాతా నుండి కాదని, ప్రజల పన్నుల ద్వారా కట్టినవేనన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు అన్యాక్రాంత కాకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు వారికి పూర్తిగా తన తోడ్పాటు ఉంటుందని, అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు.
అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితుల 10 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో సాధించిన ఫలితాలను వివరించారు. లక్ష్య సాధన కోసం ఐక్యంగా ఉద్యమించిన పరిస్థితులను తెలపగా సభ్యులంతా హర్షద్వానాలు వ్యక్తం చేశారు. గత వైసీపీి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చి, అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. టీడీపీి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆస్తులన్నీ అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని, కాని 9 మాసాలు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు, ప్రకాశం తదితర చోట్ల కోట్ల విలువైన జామాయిల్‌, ఎర్రచందనం నరుక్కుపోతుంటే అటు కంపెనీ యాజమాన్యం కాని, ఇటు ప్రభుత్వ సిబ్బంది కాని పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కంపెనీ యాజమాన్యపు బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల్ని తక్షణమే జప్తు చేయాలన్నారు. ఆరు మాసాల్లో ఈ అసెంబ్లీ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేసి డిపాజిట్‌ దారులకు విశ్వాసం కలుగజేయాలని ముప్పాళ్ళ డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రత్యేక కమిటీని, కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు.
అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఒకే లక్ష్యం కోసం గత పది సంవత్సరాలుగా పోరాడుతున్న మా అసోసియేషన్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన సీపీఐకి రుణపడి ఉంటామన్నారు. ఆస్తుల పరిరక్షణ బాధ్యతను ఆర్డీవోలకు, డీఎస్పీలకు అప్పగించాలన్నారు. కంపెనీ నుండి స్థలాలు, పొలాలు కొని రిజిష్టర్‌ చేయించుకున్న వాటిని జప్తు నుండి తొలగించాలని, కొల్లగొట్టబడిన ఆస్తులను రికవరీ చేయాలని, వారిపై కేసులు పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు వైవీఎస్‌ మహదేవ్‌ మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ పోరాటం ఒక చారిత్రాత్మకమైనదని, ఆస్తులు ఉన్నా ప్రభుత్వాలు, కోర్టులు ఉండి, కంపెనీలకు ఆస్తులన్నా పరిష్కరించడానికి అనేక సంవత్సరాలు పట్టడం సిగ్గు చేటన్నారు. బాధ్యత కల్గిన ప్రభుత్వాలే ప్రజలను మోసగిస్తే, ఇక వారి బాధలు, గాధలు ఎవరికి చెప్పుకుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కన్నీటి దీక్షకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.ఈశ్వరయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.దుర్గాభవాని, ఎన్టీఆర్‌ జిల్లా సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్‌, ప్రకాశం జిల్లా రైతు నాయకులు హనుమారెడ్డి, రాష్ట్ర చేతివృత్తుల ప్రధానకార్యదర్శి రామాంజనేయులు, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు రామానాయుడు, గుంటూరు నగర నాయకులు కోట మాల్యాద్రి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పరుచూరి రాజేంద్ర తదితరులు మద్దతు తెలియజేశారు. ఒరిస్సా రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షులు చంద్రరావు, తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీవీ రావు తదితరులు మాట్లాడారు. వేదికపై రాష్ట్ర ఉపాధ్యక్షులు జయసింహ, ఆరేలమ్మ, నాగలక్ష్మి, కేశవరావు, నగేష్‌, భాతమ్యలక్ష్మి, శివరామకృష్ణ, మల్లిఖార్జున్‌, పాల్గొన్నారు. దీక్షల్లో సుమారు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన 1500 మందికి పైగా బాధితులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పెంచలయ్య, చంద్రానాయక్‌, కోశాధికారి పిచ్చయ్య గేయాలు ఆలపించారు. సమావేశం ప్రారంభం నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాధితులు నినాదాలతో దీక్షా శిబిరం మార్మోగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *