-సాధువుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం
-ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతులు తక్షణమే రద్దు చేయాలి
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమలలో సాధువుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయటంపై ఆయన తీవ్రంగా స్పంచించారు. హిందువుల మనోభావాలకు విరుద్దంగా తిరుమలలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్‌కు అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి నుంచి విశాఖ వెళ్తున్న రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద సరస్వతి స్వామిని మార్గమధ్యలో ఆయన కలిసి పరామర్శించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక నగరాన్ని పర్యాటకం పేరిట కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరిలో శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణంపై సాధువులు, హైందవ సంఘాలు భగ్గు మంటున్నా.. ఈ ప్రభుత్వంలో కనీస చలనం లేదని ధ్వజమెత్తారు. తిరుమల ప్రక్షాళన అంటే.. ఏడు కొండలను అపవిత్రం చేయటమా..? అని నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం హిందూ సమాజాన్ని మోసం చేసిందని.. తిరుమల కొండలను కళంకం చేసేలా అన్యమతానికి చెందిన ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతివ్వడం దారుణమన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ పట్ల, తిరుమల పవిత్రత పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలను ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందని ఇప్పటికే అనేక సందర్భాలలో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. హిందు ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత సాధువులపై ఉందని.. కానీ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సాధువుల పట్ల ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. తాము ఆందోళన చేసేందుకు వెళ్లడం లేదని, స్వామిని దర్శించుకుని వినతిపత్రం సమర్పిస్తామని చెప్పినా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందన్నారు. పైగా మెడలు పట్టుకొని సాధువులను బలవంతంగా వ్యాను, కార్లు ఎక్కించటం దుర్మార్గమన్నారు. తిరుమల ప్రక్షాళణ అంటూ వల్లె వేసే సీఎం చంద్రబాబు, సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ఊగిపోయే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు దీనిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో హోటల్ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు ఇవ్వకపోయినా.. అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదని మల్లాది విష్ణు అన్నారు. శేషాద్రి పర్వతం అంచున అన్నమయ్య సహా ఎంతో మంది రుషులు తపస్సు చేసిన చోట ముంతాజ్ హోటల్ కు అనుమతినివ్వడం హిందువులను మోసం చేయడమేనని.. తక్షణమే కోట్లాది హిందువుల మనోభావాలను గౌరవించి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా హైందవ సోదరులు ఏకమై.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమించటం ఖాయమని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News