-పార్లమెంట్ చర్చలో రాజమండ్రి ఎంపీ డా. దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వివరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో ట్యూబర్‌క్యులోసిస్ (టిబి) కేసులు 2015 నుంచి 17.7% తగ్గాయని, మరణాల సంఖ్య 21.4% తగ్గిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ టిబి నివేదిక-2024 ప్రకారం ఈ తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. శుక్రవారం పార్లమెంట్‌లో రాజమండ్రి ఎంపీ డా. దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ టిబి నిర్మూలన కార్యక్రమం (NTEP) పురోగతి గురించి ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ, ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యాలతో టిబి నిర్ధారణ పరీక్షలు పెంచడం, మాలిక్యూలర్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ల విస్తరణ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా టిబి చికిత్స సేవలను గ్రామ స్థాయికి విస్తరించడం వంటి చర్యలు చేపట్టిందన్నారు. టిబి కేసులను గుర్తించి తగిన చికిత్స అందించేందుకు 347 జిల్లాల్లో 100 రోజుల టిబి నిర్మూలన ప్రచారం కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యత వర్గాలైన పట్టణ పేదలు, గిరిజనులు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్న కార్మికులకు టిబి పరీక్షలు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అలాగే, నిక్షయ పోషణ యోజన కింద టిబి రోగులకు చికిత్స కొనసాగించేందుకు ప్రోత్సాహకంగా నెలకు ₹1,000 ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు.
మారుమూల ప్రదేశాల్లో వైద్య సేవల విస్తరణ
టిబి కేసుల తగ్గుదల, మరణాల సంఖ్యలో క్షీణతపై పార్లమెంటరీ చర్చలో పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేసారు. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి, సహాయమంత్రి నాయకత్వాన్ని, శాఖ పనితీరును ప్రశంసించారు. అయితే గిరిజన ప్రాంతాల్లో టిబి వ్యాప్తి పై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవల తీరు ఏవిధంగా ఉందని ప్రశ్నించారు. దీనికి స్పందించిన సహాయ ఆరోగ్య మంత్రి అనుప్రియా పటేల్, నిక్షయ వాహనాలు అనే మొబైల్ వైద్య యూనిట్లు ఏర్పాటు చేసి స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. 100 రోజుల టిబి ప్రచారంలో భాగంగా 11 కోట్ల మంది, ముఖ్యంగా హెచ్చరిక స్థాయిలో ఉన్న ప్రజలు (హెచ్ఐవీ బాధితులు, మద్యం సేవించే వారు, పొగ త్రాగే వారు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో ఉన్నవారు) టిబి పరీక్షలు చేయించుకున్నారని వివరించారు.
బహుళ ఔషధ నిరోధక (MDR) టిబి వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో దీని చికిత్స పొడవుగా ఉండటంతో రోగులు మధ్యలోనే వైద్యం ఆపేస్తున్నారని పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిస్పందనగా, ఆరోగ్య మంత్రి పటేల్ కొత్త, కుదించిన ఆరు నెలల BPaLM చికిత్స విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇది మరింత ప్రభావవంతమైనదని, ప్రస్తుతం MDR-TB చికిత్స కేంద్రాల సంఖ్యను 126 నుంచి 826కి పెంచినట్లు వెల్లడించారు. అలాగే, ఔషధ నిల్వలపై నిరంతర నిఘా ఉంచి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నట్లు వివరించారు.
భారతదేశం 2025 నాటికి సంపూర్ణ టిబి నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Prajavartha Online Telugu News