మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎస్. సీ.ల సంక్షేమం కోసం ఎస్.సి. సబ్ ప్లాన్ నిధులు 341 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందని, వచ్చే ఏప్రిల్ మాసం మొదటి వారంలో వివిధ పథకాలు ప్రకటిస్తామని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం వారు తొలిసారిగా మచిలీపట్నం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంకు చేరుకోగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాహిద్ బాబు వారీ కార్యాలయపు సిబ్బంది, ఎస్.సి. సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా పూల మొక్కలు అందజేసి శాలువలతో సన్మానించారు.
తొలుత చైర్పర్సన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం చైర్ పర్సన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారి కార్యాలయం సిబ్బందితో సమావేశమై ఎస్సీ కార్పొరేషన్ కార్యకలాపాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తదనంతరం చైర్పర్సన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ముఖ్యంగా విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక పథకాలను అమలు చేయనుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో షెడ్యూల్ కులాల వారిని ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. కృష్ణాజిల్లాలో షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నతి పథకం భూమి కొనుగోలు పథకం తదితర పథకాల స్థితిగతులను తెలుసుకునేందుకు వచ్చామన్నారు. గత ఐదేళ్లలో ఎస్. సి. సబ్ ప్లాన్ నిధులు ఏమీ లేవని అవి పక్కదారి పట్టి, ఎలాంటి సబ్సిడీ పథకాలు అమలు కాలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 341 కోట్ల రూపాయలను బడ్జెట్ను కేటాయించిందని, సబ్ ప్లాన్ నిధులు త్వరలో విడుదలవుతాయన్నారు. ఉపాధి పథకం కింద 10 లక్షల రూపాయల లోపు స్విఫ్ట్ లేదా డిసైర్ కార్లను నిరుద్యోగ యువతీ యువకులకు అందజేయాలని ప్రతిపాదించామన్నారు.
అలాగే 4 వేల ఆటోలను కూడా మంజూరుచేస్తామన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 1లక్ష రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రూపాయలు నేరుగా సబ్సిడీ అందిస్తోందన్నారు. లబ్ధిదారులు కేవలం 15 వేల రూపాయలు చందా కడితే చాలని మిగతా మొత్తం బ్యాంకు రుణంగా అందజేస్తుందన్నారు. గత ఐదేళ్లలో ఎస్సీలు అభివృద్ధి చెందాలంటే ఏ ఒక్క పథకం లేదన్నారు. కార్లు కొనుగోలు చేశాక ఓలా, మాక్స్ వంటి వాటికి బాడుగకు వినియోగించవచ్చన్నారు.
5 కోట్ల రూపాయలతో ఒక కంపోనెంట్ తెచ్చామని అందులో 5 కంపోనెంట్స్ ఉన్నాయని నిరుద్యోగ యువతీ యువకులకు కార్లను నడపడంలో శిక్షణ ఇప్పించి లైసెన్సులు కూడా వచ్చేలా చేస్తామన్నారు. డిజిటల్ మార్కెటింగ్, పూల అలంకరణ, ఫార్మసిస్టు, 25 లక్షల రూపాయల వ్యయంతో విద్యుత్ వాహనాల చార్జింగ్ పాయింట్లు విజయవాడ, విశాఖపట్నం,తిరుపతి వంటి పట్టణాలలో ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు.
షెడ్యూల్ కులాల వర్గీకరణ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. వర్గీకరణ కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలను ఏబీసీ కేటగిరీలుగా వర్గీకరించిందన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని 1989లో నుంచి ఉందని ఆ చట్టాన్ని గత ఐదేళ్లలో గత ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి గట్టిగా అమలు చేసి ఉంటే అత్యాచారాలు నిరోధించే అవకాశం ఉండేది అన్నారు. కృష్ణా జిల్లాలోని ఎస్ ఎన్ గొల్లపాలెం లో 2017-18 సంవత్సరంలో భూమి కొనుగోలు పథకం కింద 25 ఎకరాలను సేకరించి 32 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్నతి పథకం కింద 2.10 కోట్ల రూపాయల వ్యయంతో 152 యూనిట్లను మంజూరు చేసిందని అందులో కృష్ణా జిల్లాలో 70 యూనిట్లు, ఎన్టీఆర్ జిల్లాలో 82 యూనిట్లు ఉన్నాయన్నారు. అందులో 50వేల రూపాయలను లబ్ధిదారులకు నేరుగా సబ్సిడీ అందించామన్నారు. జిల్లాలో 26 షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయని, అందులో 130 షాపులు ఉన్నాయని, వాటిలో 74 పనిచేస్తున్నాయని 56 పనిచేయడం లేదని, శిథిలావస్థలో ఉన్న షాపులను పునరుద్ధరించేందుకు 1.50 కోట్ల రూపాయల వ్యయంతో అంచనాలు సిద్ధం చేశారని త్వరలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 2014-19 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్సీల సంక్షేమం కోసం కేటాయించి అందులో 40 వేల కోట్ల రూపాయలను ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇచ్చారన్నారు. గత వైసిపి ప్రభుత్వం 9.50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి 30 వేల కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులు ఇచ్చినట్లే ఇచ్చి పక్కదారి పట్టించారన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ వెంట ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునయ్య, పలువురు షెడ్యూల్ కులాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News