-ఇన్సెంటీవ్ లు పునరుద్ధరిస్తూ నిర్ణయం
-2024-25లో రూ.5.50 కోట్ల లాభాల ఆర్జన
-ఉద్యోగులకు ప్రోత్సహామందిస్తూ ఇన్సెంటీవ్ లు మంజూరు
-కరోనా పేరుతో ఇన్సెంటీవ్ లు నిలిపేసిన జగన్ ప్రభుత్వం
-రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడి
-మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
లేపాక్షి ఉద్యోగులకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత గుడ్ న్యూస్ తెలిపారు. గత ప్రభుత్వం నిలిపేసిన ఇన్సెంటీవ్ లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో ఉద్యోగులకు ఇన్సెంటీవ్ లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. లేపాక్షి షోరూమ్ ల ద్వారా హ్యాండీ క్రాఫ్ట్స్ ఉత్పత్తుల విక్రయాలు పెంచేలా ఉద్యోగులకు ఇన్సెంటీవ్ లు ఇస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా పేరుతో గత జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటీవ్ లను అయిదేళ్ల నుంచి నిలిపేసింది. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడంతో, లేపాక్షి ఉద్యోగులకు ఇన్సెంటీవ్ లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోని పలు నగరాల్లో 97 లేపాక్షి షోరూమ్ లున్నాయి. ఆయా షోరూమ్ ల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకూ హ్యాండీ క్రాఫ్ట్స్ అమ్మకాల ద్వారా రూ.5.50 కోట్ల మేర లాభాలు ఆర్జించినట్లు మంత్రి సవిత శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
రూ.32.42 లక్షల మేర ఇన్సింటీవ్ లు
లేపాక్షి ద్వారా హ్యాండీ క్రాఫ్ట్స్ అమ్మకాలు మరింత పెరిగేలా, ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేలా ఇన్సింటీవ్ లు అందజేయాలని నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగులకు రూ.32.42 లక్షల మేర ఇన్సింటీవ్ లు అందజేస్తున్నామన్నారు. శాశ్వత ఉద్యోగులకు మూల వేతనంలో 2/3 మేర ఇన్సెంటీవ్ మంజూరు చేశామన్నారు. లేపాక్షి షో రూమ్ ల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.15 వేలు చొప్పున, రోజువారీ వేతనం తీసుకునే ఉద్యోగులకు రూ.4 వేల చొప్పున ఇన్సెంటీవ్ లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. లేపాక్షి ఉద్యోగులు ఉత్సాహంతో పనిచేసి, హ్యాండీ క్రాఫ్ట్స్ అమ్మకాలు మరింత పెంచడానికి ఇన్సెంటీవ్ లు దోహదపడతాయని మంత్రి సవిత వెల్లడించారు.
ఆకర్షణీయంగా లేపాక్షి షోరూమ్ ల అభివృద్ధి
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లేపాక్షి షో రూమ్ లను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంపద్రాయాలను ఉట్టిపట్టేలా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లేపాక్షి షోరూమ్ లకు మరమ్మతులు చేపట్టి, ఆకర్షణీయమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టానున్నారు. షో రూమ్ ల బయట, లోపల కూడా మరమ్మతులు చేపట్టనున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా షోరూమ్ లను రూపొందించడం ద్వారా వివిధ కళా రూపాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని మంత్రి సవిత వెల్లడించారు.
మంత్రి సవితకు ఉద్యోగుల ధన్యవాదాలు
అయిదేళ్ల తరవాత ఇన్సెంటీవ్ లు పునరుద్ధరించడంపై లేపాక్షి ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. శుక్రవారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవితను కలిసి వారు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమాన్ని కోరుకుంటున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు ఆశయ సాధనలో భాగంగా హ్యాండీ క్రాఫ్ట్స్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచి, హస్త కళాకారులకు అండగా నిలవాలని లేపాక్షి ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశారు.
Prajavartha Online Telugu News