-రికార్డు స్థాయిలో ప్రభుత్వం ద్వారా కొనుగోళ్ళు..
-రబీ ధాన్యం కొనుగోళ్ళు నిలిపేశారన్న పుకార్లు నమ్మొద్దు..
-రైతులకు అవసరమైన గోనె సంచులు సరఫరా చేయనున్న మిల్లర్లు..
-ఎపి రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని రైతాంగం ఎవరూ రబీ ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవద్దని, రైస్ మిల్లర్లు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన ఎఫ్.ఏ.క్యూ (ఎఫ్ ఏ క్యూ) ధాన్యాన్ని ఎం.ఎస్.పి చెల్లించి కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఎ.పి రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరావు విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో మీడియా సమావేశంలో అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరావు మాట్లాడుతూ. రైస్ మిల్లర్లు రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారని, ఇటీవల కొన్ని పత్రికలలో, మీడియాల్లో వార్తలు వస్తున్నాయని, ఇది వాస్తవం కాదన్నారు. నాణ్యత తక్కువగా ఉన్న ధాన్యం, అధిక తేమను కలిగి, ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలు (ఎఫ్.ఏ.క్యూ) ప్రకారం లేని ధాన్యం కొంత ధర తగ్గించి కొని ఉండవచ్చన్నారు. ఎఫ్.ఏ. క్యూ ప్రకారం ఉన్న ధాన్యాన్ని ఖచ్చితంగా ఎం.ఎస్.పి ప్రకారమే మిల్లర్లు కొంటున్నారని, ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. రబీ ధాన్యం సేకరణలు నిలిపివేశారన్న పుకార్లు నమ్మవద్దని, రైతుల వద్ద ఉన్న ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యం పూర్తిగా కొనేందుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వం గత సంవత్సరం కంటే అధిక పరిమాణంలో ధాన్యం కొనుగోళ్ళు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లు తరువాత కూడా రైతుల వద్ద మిగిలిన ఎఫ్.ఏ.క్యూ ధాన్యాన్ని మిల్లర్లు మద్దతు ధరకు కొంటారన్నారు. ఇందుకు అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలను మిల్లర్లు రైతాంగానికి అందుబాటులో ఉంచుతారన్నారు. ఎవరైనా మిల్లరు మద్దతు ధరకు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన ఎఫ్.ఏ.క్యూ ధాన్యం కొనుగోలు చేయకపోతే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫోన్ నెం:7386623036కు తెలియ చేయాలని, అటువంటి వారిపై అసోసియేషన్పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. 75 కిలోల బస్తా ధాన్యానికి రూ.1725లు మద్దతు ధరను చెల్లిస్తామని గుమ్మడి తెలిపారు.
ప్రభుత్వం ద్వారా ఈ సంవత్సరం 2024-25 రబీ పంట కాలంలో ధాన్యం 12 జిల్లాల నుండి 53 నేల 890 మంది రైతుల నుండి 1318 కోట్ల రూ.లు చెల్లించి 5 లక్షల 71వేల 109టన్నులు కొనుగోలు చేశారని తెలిపారు. అంతకు ముందు సంవత్సరాలతో పొల్చితే 2023-24 రబీలో 2,95,044 టన్నులు, 2022-23లో 1,23,902 టన్నులు, 2021-22లో 1,99,154 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ అధికారుల కృషిని ఆయన అభినందించారు. ధాన్యం రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ చర్యలతో పాటు, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ కూడా సిద్ధంగా ఉందని, ఎవ్వరూ అధైర్య పడే అవసరం లేదని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ షేక్ బాజీ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు అన్నే శ్రీనివాసరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News