మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జవాబుదారీగా ఉండాలన్నదే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
శుక్రవారం రాత్రి మంత్రి నగరంలోని బృందావనం థియేటర్ వద్ద గల పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను మంత్రివర్యులు ఎంతో ఓపిగ్గా ఆలకించి వాటిని సానుకూలంగా పరిష్కరించేందుకు అన్ని విధాల తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తూ వారికి అండగా నిలబడుతున్నామన్నారు. ఇదొక నిరంతర ప్రక్రియ అని క్షేత్రస్థాయిలో వాస్తవ విషయాలు ఏమిటో తెలుసుకునేందుకు ఎంతో చక్కటి వేదిక అన్నారు. ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన ప్రజల నుండి 200 అర్జీలు స్వీకరించామని వాటిని వచ్చే వారంలోగా పరిష్కరించడానికి శాయశక్తుల కృషి చేస్తామన్నారు. ఇది మంచి ప్రభుత్వమని పెంచిన పింఛను 4వేల రూపాయలను 64 లక్షల మంది లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. అలాగే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని, ఇళ్ల సమస్య లేకుండా తీరుస్తున్నామని, గుంతలు లేని రహదారులను నిర్మించామన్నారు. మరో 90 వేల కొత్త పింఛన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని త్వరలో వాటి పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛను ఇచ్చేందుకు అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని తమ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు, అమరావతి రాజధాని అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా వచ్చే మే నెల 2 వ తేదీన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని మంచి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా పి –4 ద్వారా పేదరికం లేని సమాజం నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. నిధులకు ఇబ్బంది ఉన్నప్పటికీ అవకాశం ఉన్నంతవరకు నిధులు సమకూర్చుకొని పలు అభివృద్ధి సంక్షేమ పనులు చేపడుతున్నామన్నారు. ప్రజల నుండి వచ్చే అర్జీలలో ముఖ్యంగా జి ప్లస్ త్రీ ఇల్లు సంబంధించి నానా అవస్థలు పడుతున్నారని, వాటికి సంబంధించిన సమస్యలతో పాటు ఇళ్లస్థలాలు కావాలని కోరుతూ అర్జీలు ఎక్కువగా వచ్చాయన్నారు. గ్రామాల్లో 90 శాతం రహదారులను మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద పూర్తి చేశామని మిగిలిన పనులను కూడా మౌలిక వసతుల నివేదికలు తెప్పించుకొని దశల వారీగా పూర్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు మచిలీపట్నం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కుంచె నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు స్థానిక నాయకులు ఇలియాస్ భాష తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News