-ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి
-సమాజంలో అందరితో సమానంగా ఎదగాలి
-173 మందికి రూ. 18.70 లక్షల విలువైన ఉపకరణాల పంపిణీ
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి.. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు, అధికారులు, కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకు రూ. 18.70 లక్షల విలువైన 273 పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, బ్రెయిలీ కిట్లు, క్రచ్ ఎల్బోలు, టీఎల్ఎం కిట్లు, వీల్ ఛెయిర్లు, వాకింగ్ స్టిక్‌లు, రోలటార్లు వంటివి అందజేయడం జరిగిందన్నారు. ఈ ఉపకరణాలు ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని.. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపుతోందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు. రానున్న రోజుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
విభిన్న ప్రతిభావంతులకు అండగా ప్రభుత్వం: శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు
రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటోందని, ప్రభుత్వ సదుపాయాలు, సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భవిష్యత్తులోనూ విభిన్న ప్రతిభావంతులకు ఇదేవిధమైన సహాయం అందుతుందని, సదరం సర్టిఫికెట్లతో కొత్త పెన్షన్లు కూడా అందించడం జరుగుతుందన్నారు. దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ అందుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతుల సమగ్రాభివృద్దిలో ఎన్‌జీవోలు కూడా భాగస్వాములవుతున్నాయన్నారు. విభిన్న ప్రతిభావంతులు బాగా చదువుకునేందుకు తోడ్పడే ఉపకరణాలు అందించడం జరుగుతోందని.. ఎన్ని కావాలన్నా ఇలాంటి ఉపకరణాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
కార్యక్రమంలో డీఈవో యూవీ సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి.మహేశ్వరరావు, సమగ్ర శిక్ష అధికారి ఎల్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News