గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేదమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండివిడ్యుల్ హౌస్ హోల్డ్ టాయ్ లెట్ పధకంలో భాగంగా నగరంలో మరుగుదొడ్ల నిర్మాణ దరఖాస్తులను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని పుర సేవ కేంద్రం, కాల్ సెంటర్ లో బుధవారం నుండి అందుబాటులో ఉంటాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బహిరంగ మలమూత్ర విసర్జన ప్రజారోగ్యానికి భంగం కల్గిస్తుందన్నారు. ప్రజారోగ్య రక్షణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చేయూత ఇస్తుందని పేర్కొన్నారు. ఇంటిలో స్థలం ఉండి, మరుగుదొడ్లు లేని వారు జిఎంసిలో ఉండే పురసేవ కేంద్రం, కాల్ సెంటర్ లో రైస్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నంబర్,కుల ధృవీకరణ, బ్యాంక్ అకౌంట్ వివరాలతో దరఖాస్తులు తీసుకొని పూర్తీ చేసి అందించాలని తెలిపారు. కనుక నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News