-రక్తదానంపై యువతలో చైతన్యం రావాలి..
-రక్తదానంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగిద్దాం…
-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తదానం మానవత్వానికి మరో రూపమని ప్రాణాపాయి స్థితిలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించడం ప్రాణాలను కాపాడడం మరో జన్మనివ్వడమేనని, రక్తదానం చేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని సమాజంలో ఉన్న అపోహలను తొలగించి రక్తదానానికి ముందుకు వచ్చేలా యువతను ప్రాత్సహించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు.
స్థానిక సూర్యరావు పేట నక్కలరోడ్డులోని శ్రీథర్ కోచింగ్ సెంటర్ నందు మంగళవారం నిర్వహించిన మోగా రక్తదానం శిభిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రక్తదానం చేయడం మానవత్వానికి మరో రూపంగా భావించాలన్నారు. ప్రాణాపాయి స్థితిలో ఉన్నప్పడు సకాలంలో రక్తం లభించకపోవడం వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే ఒక మానవతావాది రక్తంలో ఉండే గ్రూపులను వర్గీకరించి ఉండకపోతే ప్రపంచంలో ఇప్పటికీ రక్తమార్పిడి కారణంగా మరణాలు సంభవించేవన్నారు. రాష్ట్రంలో అనేక మంది రక్త హీనతతో భాదపడుతున్నారని సుమారు 6 వేల మందికి పైగా తలసీమియా వ్యాధికి గురి కావడం జరిగిందని వీరి ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం రక్త మార్పిండి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం అనేది ప్రాణదానం లాంటిద అన్నారు. ప్రమాదానికి గురి అయినప్పుడు, అత్యవసర శస్త్ర చికిత్సల సమయంలో రక్త అవసరం వుంటుందన్నారు. రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని ఉత్పత్తి చేయలేమన్నారు. రక్త అవసరమయ్యే జీవితాలకు రక్తదాతలే ప్రాణదాతలన్నారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు రక్తదానం చేయవచ్చునని, జీవిత కాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తాన్ని దానం చేయవచ్చునన్నారు. రక్తదానంతో నీరసించి పోతామనే అపోహను తొలగించి రక్తదానం చేసిన ప్రతీ సారి ఆరోగ్యవంతమైన కొత్త రక్తాన్ని పొందగలుగుతామనే విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లి రక్తదానం వైపు మొగ్గు చూపేలా కృషి చేయాలన్నారు. కొత్త యువత కూడా ముందుకు వచ్చి స్వచ్చందంగా రక్తదాన శిబిరాలలో పాల్గొనేలా స్పూర్తిని నింపాల్సిన అవసరం ఉందని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో పోటీ పరీక్షలకు యువతను సన్నద్దులను చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మోగా రక్తదానం శిభిరాలను ఏర్పాటు చేసిన శ్రీధర్ కోచింగ్ సెంటర్ నిర్వహులను అభినందిస్తున్నానన్నారు. దేశ ప్రగతిలో యువత పాత్ర కీలకమన్నారు. యువతలో మెదోశక్తిని పెంపొందించి వారిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిల్పాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలను చర్యలు తీసుకుంటుందని వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో శ్రీధర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు కొమ్మూరి శ్రీధర్, సీతారామిరెడ్డి, డా. మధన్ మోహన్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News