Breaking News

ఆర్డీటీని కాపాడుకుందాం

-అఖిలపక్ష నేతల పిలుపు
-సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యలు
-త్వరలో అనంతపురంలో సంఫీుభావ సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో కల్పతరువుగా ఉండి పేదల అభ్యున్నతికి 56ఏళ్లుగా మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న రూరల్‌ డెవలప్మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ)ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అఖిలపక్ష నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు, సీనియర్‌ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వై.ప్రభాకర చౌదరి, కాంగ్రెస్‌ పార్టీ నేత కొరివి వినయ్‌ కుమార్‌, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి..తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపు నిచ్చారు.

విజయవాడ దాసరిభవన్‌లో జన చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ఆర్డీటీని కాపాడుకుందాం’ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. దీనికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రసంగిస్తూ..విన్సెంట్‌ ఫెర్రర్‌ 1969లో అనంతపురంలో ఆర్డీటీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారని, గ్రామీణ అభివృద్ధి ధ్యేయంగా లక్షలాది కుటుంబాలకు విద్యా, వైద్యం, తాగునీరు, వైజ్ఞానిక అభివృద్ధి లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. బత్తులపల్లి ఆసుపత్రి కరోనా సమయంలో వేలాదిమందిని బతికించిందని, ప్రతిభ గల విద్యార్థులకు ఆర్డీటీ ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. విన్సెంట్‌ ఫెర్రర్‌ కుటుంబం స్పెయిన్‌ నుంచి వచ్చినప్పటికీ..భారతీయ పౌరసత్వం తీసుకొని తన కుమారుడు మంచూ ఫెర్రర్‌ వెనకబడిన వర్గాల హిందూ మహిళని వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన సమాజాల అభ్యున్నతి కోసం ఈ సంస్థ లాభాపేక్ష లేకుండా పనిచేస్తోందని వివరించారు. విద్యా, ఆరోగ్యం, మహిళా సాధికారత, వ్యవసాయ అభివృద్ధి, వికలాంగుల సంక్షేమం వంటి రంగాల్లో ఆర్డీటీ గణనీయమైన కృషి చేసిందన్నారు. కేవలం వైద్య సేవలు కోసం సంవత్సరానికి రూ80కోట్లు ఖర్చు చేస్తూ..పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోందన్నారు. ఆర్డీటీ సంస్థ తన కార్యక్రమాల నిర్వహణకుగాను విదేశీ సంస్థల నుంచి వచ్చే నిధులపై ఆధారపడుతోందని, ఈ నిధులు ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌(ఎఫ్‌ సీఆర్‌ఏ)కు లోబడి ఉంటాయని..కేంద్ర హోం శాఖ పరిధిలో ఉన్న ఈ యాక్ట్‌ను ఉపయోగించి ఇటీవల ఆర్డీటీ సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీంతో విదేశీ నిధులు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడిరదని, ఈ నిర్ణయం వల్ల ఆర్డీటీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వాలు చేయలేని కార్యక్రమాలను చేస్తున్న సంస్థపై మతం రంగు ఆపాదించి నిర్వీర్యం చేయాలని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సంస్థ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఈ అంశంపై ఇటీవల సీఎం చంద్రబాబును తమ పార్టీ బృందం కలిసిన సందర్భంంలో ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. ఇటీవల మంత్రులు పయ్యావుల కేశవ్‌, సత్య కుమార్‌ యాదవ్‌ ట్రస్ట్‌ ప్రతినిధులను కలిపి ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆరా తీసినట్లు తెలిసిందన్నారు. సంస్థను కాపాడుకునేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్ఛేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల, మేధావుల తోడ్పాటుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవాలన్నారు.ఒకవైపు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ మరోవైపు విదేశీ విరాళాలతో నడిచే సంస్థలను నిరోధించడం సహేతుకం కాదని, లౌకిక భావాలతో పేదరిక నిర్మూలన కోసం విదేశీ సంస్థల, వ్యక్తుల విరాళాలతో నడిచే సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడం దురదృష్టకరమన్నారు. టీడీపీ సీనియర్‌ నేత మాజీ శాసనసభ్యులు వై. ప్రభాకర చౌదరి ప్రసంగిస్తూ ఆర్డీటీకి కుల, మతాలు లేవని, లేవని మదర్‌ థెరెస్సాను ఆదర్శంగా తీసుకుని అనంతపురం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంమిరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ 3,877 గ్రామాల్లో పనిచేస్తోందని, తెలంగాణలో నాగర్‌ కర్నూలు, నల్గొండ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణాజిల్లాలో సేవా కార్యక్రమాలతో విస్తరించిందన్నారు. పీ4 ఆలోచనను 50 సంవత్సరాల క్రితం నుంచి అమలు చేస్తుందని అలాంటి ఆర్డిటిని కాపాడుకోవాల్సిన మహత్తర బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని, బలహీనంగా ఉన్న కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చి..ఆర్డీటీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు ప్రసంగిస్తూ అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు అనే చందాన నేడు కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో మైనార్టీ పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ, పేద, బడుగు జీవుల విద్య, వైద్యంతోపాటు అన్ని విధాలా ఆదుకుంటున్న ఆర్డీటీని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, దాని వెనుకున్న ఆరెస్సెస్‌లాంటి సంస్థలు..నిధుల విడుదలకు ఆటంకాలు కలిగించడం హేయమని చర్యని తప్పుపట్టారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ, మోదీ మతతత్వ విధానాలతో ఆర్డీని నిర్వీరం చేసే కుట్రలకు తెగబడ్డారని మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో మూడు తీర్మానాలను ఆమోదించింది. సీఎం చంద్రబాబును ప్రతినిధుల బృందం కలిసి ఆర్డీటీ ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేలా కేంద్ర హోంశాఖపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతిపత్రం అందించాలని, త్వరలో అనంతపురం నగరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఆర్డిటీ పరిరక్షణ కోసం సంఫీుభావ సదస్సును నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని, పార్లమెంటు జరిగే సమయంలో అన్ని రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల ప్రతినిధుల బృందం దిల్లీకి వెళ్లి మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల సహకారంతో సంబంధిత హోంశాఖ అధికారులతో కలిసి వినతి పత్రం అందించాలని, కుల, మత రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీని పటిష్ట పరచడానికి కృషి చేయాలని తీర్మానించారు.

ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కొరివి వినయ్‌ కుమార్‌, సాహితీవేత్త గోళ్ల నారాయణరావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి అధ్యక్షులు పి.చంద్రానాయక్‌, ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్ల పూర్వ అధ్యక్షులు ఏవీ పటేల్‌, సీపీఐ విజయవాడ కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి కళాకారులు అభ్యుదయ గేయాలను ఆలపించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *