నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుల నుంచి నేరుగా మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఉండాలని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు.
బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో నిడదవోలు పరిధిలో ఉన్న మిల్లర్ల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలు పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాకి నిర్దేశించిన 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని నిర్దేశించడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా ఆయా మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి సీజన్ లో రైతుల నుంచి మిల్లర్లు నేరుగా ధాన్యం కొనుగోలు చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు. అటువంటి లావాదేవీలు నిర్వహించే సమయంలో విధిగా “బి” రిజిస్టర్ లో సంబంధిత లావాదేవీల వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి వొచ్చిన ధాన్యం వివరాలు ” ఏ ” రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. కోనుగోలు కోసం రైతులని ఎటువంటి ఇబ్బందులకు గురి చెయ్య వద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి సీజన్ లో రైతుల నుంచి మిల్లర్లు నేరుగా కొనుగోలు చెయ్యడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 48 గంటల్లో జమ చెయ్యడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా గతంలో కంటే అధికంగా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిపారు. కావున మిల్లర్లు నేరుగా చేపట్టే కొనుగోలు విషయంలో చెల్లింపులు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలోఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎమ్ ఆర్ ఆర్ ప్రేమ్ కుమార్, తహసిల్దార్ బి. నాగరాజు నాయక్ , నిడదవోలు మండల మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. రమేష్, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News