-నీటి సమస్యను అధిగమిచ్చేందుకు కృష్ణానది నుంచి పైప్ లైన్ నిర్మాణం
-రూ.2.40 కోట్ల విలువైన ఆకుమర్రు సమగ్ర రక్షిత నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
తరకటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం ఆయన తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద ఆకుమర్రు సమగ్ర రక్షిత నీటి సరఫరా అభివృద్ధి పనులు యస్.యస్ ఫిల్టర్స్ మరమత్తుల శంఖుస్థాపన కార్యక్రమములో పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తో కలిసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం పరిసర ప్రాంతంలోని ప్రజలకు తాగునీటిని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నాడు దాదాపు 200 ఎకరాల్లో తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏర్పాటు చేశారని, నాటి నుంచి టిడిపి అధికారంలో ఉన్న సమయంలో వాటి నిర్వహణ బాధ్యతలను చేపడుతూ వస్తోందన్నారు. 2014-19 టిడిపి ప్రభుత్వ హాయంలో పాత వాటి స్థానంలో నాణ్యమైన పైపులైన్లను నిర్మించిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. నేడు రూ.2.40 కోట్ల వ్యయంతో ఆకుమర్రు సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకానికి నాలుగు ఫిల్టర్ బెడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులకు నిధులను వెచ్చిస్తున్నామన్నారు. ఈ స్కీము ద్వారా మచిలీపట్నం మండలంతోపాటు పెడన నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు దాదాపు 55 వేల మంది జనాభాకు ప్రతిరోజు తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులో ఉన్నాయని, వీటికి రాష్ట్ర ప్రభుత్వ నిధులను జోడించి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు పైప్ లైన్ నిర్మాణం చేపట్టి పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాలలో సిసి రోడ్లు, అదేవిధంగా గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం ద్వారా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టామన్నారు.
అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్‌ను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏట రూ.33 వేల కోట్లను వెచ్చిస్తోందన్నారు. పాఠశాలలు పున ప్రారంభించే నాటికి కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు నేరుగా వారి తల్లులు ఖాతాలకు జమ చేస్తామన్నారు. అదేవిధంగా ఉచిత గ్యాస్ కు సంబంధించిన నగదు మొత్తాన్ని ముందుగానే లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే విధంగా రూపకల్పన చేస్తున్నామని, రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తాగునీటి సమస్య తీర్చేందుకు అవసరమైన నిధులను కేటాయించి కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. పెడన నియోజకవర్గంలోని దాదాపు అన్ని రక్షిత మంచినీటి పథకాలకు గత ప్రభుత్వ హయాంలో అవసరమైన నిధులు కేటాయింపు జరగక మరుగున పడ్డాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిల్టర్ బెడ్లు తదితర పనుల మరమ్మతులకు నిధులను కేటాయిస్తున్నారన్నారు. ప్రజలు కోరుకున్న విధంగానే సుపరిపాలన అందిస్తున్నామని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నామన్నారు.
తరకటూరులోని సమగ్ర రక్షిత మంచినీటి పథకం ద్వారా పెడన నియోజకవర్గంలోని పెడన మున్సిపాలిటీతో పాటు తాగునీటి సమస్య అధికంగా ఉన్న గ్రామాలకు అందిస్తున్నారని, అదే రీతిలో గూడూరు గ్రామానికి సైతం తాగునీరు అందించే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), కూటమి నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు (బుల్లయ్య), స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గోవు సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News