గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో దాడులకు, అన్యాయానికి గురైన మహిళలకు భరోసా, భద్రత కల్పించి వారికి న్యాయం చేయటమే రాష్ట్ర మహిళా కమిషన్ ప్రదాన ఏజెండా అని, దానిలో భాగంగా దాడులకు గురైన బాధితులకు వసతి కల్పిస్తున్న శక్తి సదన్ లు పరిశీలిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ నంబూరులోనీ జెఎంజె శక్తి సదన్ ను, గుంటూరు మహిళా ప్రాంగణంలోని శక్తి సదన్, ఒన్ స్టాప్ సెంటరును సందర్శించారు. శక్తి సదన్ లో వసతి పొందుతున్న మహిళలతో మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు తెలుసుకున్నారు, మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ విలేకరులతో మాట్లాడుతూ అన్యాయానికి గురైన మహిళలను సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా నడపటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మిషన్ శక్తిలో భాగంగా శక్తి సదన్ లను స్వఛ్చంధ సేవ సంస్థలు, ప్రభుత్వం అధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 441 శక్తి సదన్ లు ఉన్నాయని, రాష్ట్రంలో 27 శక్తి సదన్ లు నడుస్తున్నాయన్నారు. శక్తి సదన్ భవనాల పరిస్థితి, ఇతర మౌలిక సౌకర్యాలు, పనితీరును పరిశీలించేందుకు నంబూరులోని జెఎంజె శక్తి సదన్ ను, మహిళా ప్రాంగణంలోని శక్తి సదన్ ను సందర్శించి వాటిలో వసతి పొందుతున్న మహిళలతో మాట్లాడి నిర్వహణ తీరును తెలుసుకోవటం జరిగిందన్నారు. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం తగ్గకుండా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుందన్నారు. శక్తి సదన్ లో బాధిత మహిళలకు వసతి , ఆహారం, ఆరోగ్యంతో పాటు, అవసరమైన వారికి లీగల్ సహాయం అందిస్తారని, అదే విధంగా భవిష్యత్తులో వారికి స్వయం ఉపాధికి అవసరమైన విద్యా, ఇతర నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. బాధిత మహిళలకు చిన్నారులు ఉంటే వారికి వసతి కల్పించి విద్యా, ఉపాధి అవకాశలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. స్వఛ్చంధ సేవా సంస్థల అధ్వర్యంలో నడుస్తున్న కొన్ని శక్తి సదన్ లలో అశ్రమం పొందుతున్న బాధిత మహిళలకు వివాహాలు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఐదు సంవత్సరాలుగా శక్తి సదన్ లకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు మంజూరు చేయలేదని తెలిసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో పెండింగ్ లో ఉన్న నాలుగు మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటేనే బాధిత మహిళలకు వసతి కల్పిస్తున్న శక్తి సదన్ ల నిర్వహణ సక్రమంగా కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వంలో శక్తి సదన్ లో వసతి పొందిన మహిళలు స్వయం ఉపాధి ద్వారా వచ్చిన నగదును ప్రభుత్వ గ్రాంట్ లు వచ్చే వరకు నిర్వహణ ఖర్చులకు అందించిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అన్యాయానికి గురైన మహిళలకు భద్రత, భరోసా కల్పించే కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయటానికే రాష్ట్ర మహిళా కమిషన్ ఉందన్నారు. గత ప్రభుత్వంలో మహిళా కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, ప్రస్తుతం మహిళా కమిషన్ తీరు పూర్తిగా మార్చుకొని రాష్ట్రంలో అపదలో ఉన్న మహిళలకు, అన్యాయానికి గురైన మహిళలను ఆదుకుని న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. బాధిత మహిళలకు సత్వరమే న్యాయం అందించేందుకు పోలీస్, ఒన్ స్టాప్ సెంటరు, మహిళా ప్రాంగణం అధికారులు సమన్వయం చేసేలా రాష్ట్ర మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వంలో అమరావతిలో మహిళలపై జరిగిన దాడులపై జాతీయ మహిళా కమిషన్ లో పెండింగ్ లో ఉన్న పిర్యాదులను విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. దాడులకు, అన్యాయాలకు గురైన మహిళలకు వసతి కల్పించటానికి ప్రభుత్వం శక్తి సదన్ లను నిర్వహిస్తుందని , మహిళలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రటరీ బి వసంత బాలా, జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరక్టర్ విజయలక్ష్మీ, మహిళా ప్రాంగణం మేనేజరు రమణశ్రీ, ఏడీ నిర్మల, తదితరులు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News