గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామని, గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాల్లో 3.15 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించడానికి శంకుస్తాపన చేయడం జరిగిందని నగర మేయర్ కోవేలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 54, 56 డివిజన్లలో 2.43 కోట్లతో మరియు పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో 72.20 లక్షలతో సి.సి రోడ్లు, సి.సి డ్రైన్లు మరియు త్రాగునీ పైప్ లైన్లు ఏర్పాటు చేయుటకు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నజీర్ మహ్మద్ మరియు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు, పశ్చిమ మరియు ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజావసరాల దృష్టిలో పెట్టుకొని స్థానిక శాసనసభ్యులు పలు అభివ్రుద్ది పనులు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గుంటూరు నగరంలో సుమారు 5 వందల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు, నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్ల పైకి వర్షపు నీరు నిలుస్తూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రథినిధుల ప్రతిపాదనలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. గుంటూరు నగరంతో పాటు నగరంలో విలీన గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు పార్టీలకతీతంగా ప్రాధాన్యతా క్రమంలో నిర్వహించుటకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గుంటూరు నగరాభివ్రుద్దికి కట్టుబడి ఉన్నామన్నారు. నగరాభివ్రుద్దికి నగరంలోని యం.యల్.ఎ లు, యం.యల్.సి లు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులను కలుపుకొని వెళ్తామని, వారి అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలియచేశారు.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ మహమ్మద్ మాట్లాడుతూ, గుంటూరు నగర పాలక సంస్థలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కలపనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాక తూర్పు నియోజకవర్గంలోని శివారు కాలనీలలో ప్రజల సౌకర్యార్ధం మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా నూతనంగా డ్రైన్లు, రోడ్లు నిర్మించుటకు శంకుస్థాపనలు చేశామన్నారు. అలాగే గుంటూరు నగరం రాజధాని అమరావతి పరిధిలో ఉన్నందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో 72.20 లక్షలతో సి.సి డ్రైన్లు మరియు రోడ్లు నిర్మించుటకు శంకుస్తాపన చేశామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో త్రాగు నీటి సమస్య లేకుండా ఎప్పటికప్పడు చర్యలు తీసుకున్నామని, అలాగే రానున్న వానా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వానలు పడ్డప్పుడు వర్షపు నీరు నిలువకుండా కాలువల్లో సిల్ట్ ను కూడా తీయించామన్నారు. అలాగే పనులు చేస్తున్న గుత్తేదార్లు పనులను నిర్దేశిత సమయంలో నాణ్యతాప్రమానాలతో పూర్తి చేయాలన్నారు.
సదరు కార్యక్రమంలో కార్పోరేటర్లు కొమ్మినేని కోటేశ్వర రావు, ఐశెట్టి కనకదుర్గ, మల్లవరపు రమ్య, ఈరంటి వరప్రసాద్, ఈ.ఈ సుందర్రామిరెడ్డి, జనసేన నాయకులు గాదె వెంకటేశ్వర రావు, టి.డి.పి నాయకులు దాసరి రాజా మాస్టర్, బి.జే.పి నాయకులు ఇతర టి.డి.పి, జనసేన నాయకులు, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News