అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడవ వారంలో విశాఖపట్నంలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ జరగనుంది.ఫ్లీట్ రివ్యూ అనేది వివిధ దేశాల నౌకాదళాలతో సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు నిర్వహించే అంతర్జాతీయ సముద్ర వ్యాయామ ప్రక్రియగా పేర్కొన వచ్చును.ఈమేరకు బుధవారం విశాఖపట్నం తూర్పు నావికా దళం చీఫ్ ఆఫ్ స్టాప్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్షేనా రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై త్వరలో జరిగే అంతర్జాతీ ప్లీట్ రివ్యూ మరియు మిలాన్(MILAN 2026)నిర్వహణపై సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ కె విజయానంద్ మాట్లాడుతూ త్వరలో జరిగే ఫ్లీట్ రివ్యూకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందించి ఈవెంట్ విజయవంతం చేసేందుకు అన్నివిధాలా తోడ్పాటును అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఈప్లీట్ రివ్యూ నిర్వహణతో అంతర్జాతీయంగా భారత దేశానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా విశాఖపట్నానికి మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.అదే విధంగా పర్యాటక పరంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు.
ఈప్లీట్ రివ్యూకు భారత రాష్ట్రపతి,ప్రధానమంత్రి సహా వివిధ దేశాల నావికాదళ అధికారులు,ఇతర ప్రముఖులు హాజరు కానున్నందున అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉందని సిఎస్ చెప్పారు.ప్లీట్ రివ్యూ నేపధ్యంలో విశాఖపట్నం నగరాన్ని అన్ని విధాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా రహదారులను మెరుగు పర్చడం,సుందరీకరణ, విద్యుత్ దీపాలు ఏర్పాటు వంటి అంశాల్లో చర్యలు తీసుకోవాలని విశాఖ కలక్టర్,విఎంఆర్డిఏ,విశాఖ పోర్టు ట్రస్ట్,నేషనల్ హైవే అధారిటీ ఆప్ ఇండియా, తూర్పు నావికాదళం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రగతిలో ఉన్న వివిధ సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సుందరీకరణ ఇతర మౌలిక సదుపాయాలు మెరుగు పర్చేందకు ఆకాశమే హద్దుగా తగిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు సిఎస్ విజయానంద్ సూచించారు.
ఈసమావేశంలో తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ సమీర్ సక్షేనా మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరి 14 నుండి 24 వరకూ విశాఖపట్నంలో భారత నావికాదళం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్వూ మరియు మిలాన్ 2026 ఈవెంట్లు జరగనున్నాయని తెలిపారు.ఈప్లీట్ రివ్యూకు భారత రాష్ట్రపతి,ప్రధాన మంత్రి సహా ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని చెప్పారు. ఈప్లీట్ రివ్యూకు 145 దేశాలను ఆహ్వానించామని ఆయా దేశాలకు చెందిన నావల్ చీఫ్ లు ఇతర ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొంటారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించాలని సిఎస్ కు విజ్ణప్తి చేశారు.
ఈసమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా,మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కమోడోర్ అబి మాథ్యూ,ఎపి నావల్ ఆఫీసర్ ఇన్చార్జి కమోడోర్ రజనీష్ శర్మ, సివిల్ మిలటరీ లైజన్ అధికారి వైకె కృష్ణారావు పాల్గొన్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, విఎంఆర్డిఏ,పోర్టు ట్రస్టు తదితర అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News