-కార్యస్థానం పనులను త్వరితగతిన పూర్తిచేయండి
-అధికారులకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)తో సరికొత్త ఊపు రానుందని.. ఈ హబ్‌తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని.. ఇందుకు సంబంధించి విజయవాడ స్పోక్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తిచేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
సోమవారం టాటా ఇన్నొవేషన్ హబ్ – స్పోక్ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన కార్యాలయం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎనికేపాడులోని ఓ భవనాన్ని కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐహెచ్ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నాలుగైదు రోజుల్లో నాలుగో అంతస్తులోని ఒక బ్లాకు పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. స్టార్టప్, ఆవిష్కరణల వ్యవస్థలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలను అమలుచేయడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం అమరావతిలో రతన్ టాట్ ఇన్నొవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఈ హబ్‌కు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్‌లో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను అభివృద్ధి చేయడం జరుగుతోందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్య సాధనకు, స్వర్ణాంధ్ర @ 2047 దార్శనికతను సాకారం చేయడంలో ఇన్నొవేషన్ హబ్ కీలకంగా నిలవనుందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ వెంట విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, తహసీల్దారు బి.సుగుణ, ఆర్ అండ్ బీ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News