-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షిస్తూ మూడు కార్యాలయాల అధికారులతో గతవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పరిష్కరించిన దరఖాస్తులపై సమీక్షించారు.
వారం లో ఒక రోజు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు సమయపాలన పాటించాలని, ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయంలో అధికారులందరూ 10 గంటలకు హాజరు కావాలని అన్నారు. దరఖాస్తుదారులను వేచి ఉంచకుండా వెంటనే దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పురమిత్ర యాప్ లో స్వీకరించిన ఫిర్యాదులను, అధికారులు పరిష్కరించిన తీరును సమీక్షించారు. ఎప్పటికప్పుడు పురమిత్ర ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన ప్రతి ఫిర్యాదులో నాణ్యమైన, శాశ్వతమైన పరిష్కారం అందించాలని, ప్రజలకు పరిష్కారం చూపించాలే తప్ప వేరే శాఖపై సమస్యను మళ్లించకూడదని అధికారులను హెచ్చరించారు. శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని వచ్చిన ప్రతి ఫిర్యాదు శాఖల సమన్వయంతో పరిష్కరించాలని కమిషనర్ అన్నారు.
ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను, శాఖధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 13 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 9, ఇంజనీరింగ్ 2 , రెవెన్యూ సంబంధించినవి 1, ఎస్టేట్ 1 , మొత్తం కలిపి 13 ఫిర్యాదులను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, పర్యవేక్షణ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, బయాలజిస్ట్ సూర్యకుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News