-విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్ ప్రారంభం
-ఇది అన్ని రంగాల్లో ముందడుగు : జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెవిన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 26 జిల్లాలలో, 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు ను వర్చువల్గా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రారంభించడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెవిన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
సోమవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని విసి హాల్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి 26 జిల్లాలలో, 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు ను అమరావతి నుండి వర్చువల్గా ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా ఇంచార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్.పి. హర్ష వర్ధన్ రాజు, జేసి శుభం బన్సల్, డి.ఆర్.ఓ. నరసింహులు , సంబందిత అధికారులు విసి ద్వారా పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ… జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని…ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని ముఖ్యమంత్రి అన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీమ్ కూడా ఇస్తున్నామని… ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది ఒకమంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిందిగా సూచించారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని, ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రెవిన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, వికసిత్ భారత్ – 2047 కు అనుగుణంగా, స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 10 సూత్రాలు , 7 బేసిక్ ఎమినిటీస్ తో అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ముఖ్యమంత్రి గారిచే నేడు లాంచ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి జిల్లాలో జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయ స్థాయి విజన్ డాక్యుమెంట్లు రూపొందించామని చెప్పారు. రానున్న ఈ ఐదేళ్లలో సాధించే అభివృద్దితోపాటు, 2047 నాటికి సాధించాల్సిన అభివృద్దిని కూడా ఈ డాక్యుమెంట్లలో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడం, ఉద్యోగాలను ఇవ్వడం, మౌలిక వసతులను కల్పించడం, అభివృద్ది తదితర అంశాలు ఈ యాక్షన్ ప్లాన్లో ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి విజనరీ ముఖ్యమంత్రిగా పేరుందని, ఆయన రూపొందించిన విజన్ ప్లాన్ భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుందని చెప్పారు. ఏడాదిలోనే దీనికి పునాది పడిందని చెప్పారు. ప్రతీ నియోజకవర్గానికీ ఐదుగురు సభ్యుల బృందాన్ని కూడా నియమించామన్నారు. అసమానతలను తొలగించేందుకు పి4 విధానం ఒక మార్గమని అన్నారు. బంగారు కుటుంబాలను ఆదుకొనేందుకు సుమారు 20 లక్షలమంది మార్గదర్శకులను గుర్తించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అదే విధంగా ఈ రోజు ఉదయం మహతి ఆడిటోరియం నందు జిల్లాలోని విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేలా, ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించే దిశగా నేడు మన ముఖ్యమంత్రి షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం నిర్వహచడం జరిగిందని అందులో కులమతాలకు అతీతంగా చదువులో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు మెడల్స్, నగదు, సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగిందని , దీని ద్వారా రాబోవు రోజుల్లో అందరు విద్యార్థులు దీనిని స్పూర్తిగా తీసుకుని బాగా చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు చేయడం జరిగిందని తెలిపారు.
Prajavartha Online Telugu News