-2024-25 విద్యాసంవత్సరంలో జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన 207 మంది 10 వ తరగతి, 40 మంది ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ తో పాటు రూ.20 వేల నగదు మెడల్స్ బహుకరణ
-సమాజానికి ఆదర్శంగా ఉండేలా విద్యార్థులు ఎదగాలి :జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
-రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించే దిశగా షైనింగ్ స్టార్ అవార్డులను ఇవ్వడం శుభ పరిణామం : తిరుపతి, సత్యవేడు శాసనసభ్యులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిభకు పట్టం కట్టేలా, విద్యార్థులను ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని రెవెన్యు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
సోమవారం ఉదయం స్థానిక మహతి ఆడిటోరియం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధర్వంలో 2024-25 సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు ఎంఎల్ఏ లు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, హస్త కళా కార్పోరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ , యాదవ కార్పోరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ రుద్ర కోటి సదాశివం, డిప్యుటీ మేయర్ ఆర్.సి. ముని కృష్ణలతో కలసి ముఖ్య అతిథిగా రెవెన్యు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు మాట్లాడుతూ.. ప్రతిభకు పట్టం కట్టేలా, విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించేలా విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. పేదరికం వలన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో విలువలతో కూడిన విద్య ను తీసుకువచ్చేలా విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖా మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కేజీ నుంచి పిజి వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసే దిశగా ప్రణాలికా బద్దంగా కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వ బడులలో విద్యా శాతం పెంచే దిశగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. విద్యార్థులను ప్రోత్సహించే దిశగా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతోందని ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహకాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించే దిశగా షైనింగ్ స్టార్ అవార్డ్ లు ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా నేడు 2024-25 విద్యాసంవత్సరంలో జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన 207 మంది10 వ తరగతి, 40 మంది ఇంటర్ విద్యార్థినీ విద్యార్థుల కు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ తో పాటు రూ.20 వేల నగదు, మెడల్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. బడుల్లో అత్యంత ప్రతిభ కనబరచిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించిన పిల్లలందరికీ ఈరోజు మండలాల వారీగా విద్యా శాఖా వారి ఆద్వర్యం లో షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ బడులలో పిల్లలు చదువుకొని అక్కడున్నటువంటి సదుపాయాలను వాడుకొని మంచి మార్కులు సాధించి అవార్డులు తీసుకోవడం అందరికీ ఆదర్శంగా ఉంటుందని తెలిపారు. తద్వారా రాబోయే విద్యా సంవత్సరాలలో అందరు విద్యార్థులు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలోకి రావాలని తెలిపారు. విద్యార్థులందరూ హార్డ్ వర్క్ నుండి స్మార్ట్ వర్క్ మీద దృష్టి పెట్టాలని అన్నారు. భోదనలో నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ అని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని , చదువు అనేది విద్యార్థులకు భారం కాకూడదని తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఎటువంటి ఒత్తిడికి గురి చేయకుండా ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థుల ఆశయం అనేది దీర్గకాలిక లక్ష్యంగా ఉండాలన్నారు. విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో తాము అనుకున్న ఆశయం వైపు అడుగులు వేయాలన్నారు. విద్యార్థులు టెక్నాలజీ అందిపుచ్చుకుని నైపున్యాభివ్రుద్ధిగా దిశగా అడుగులు వేయాలన్నారు. సోషల్ మీడియా వలన చెడుతో పాటు మంచి కూడా ఉంటుందని అవసరానికి అనుగుణంగా సోషల్ మీడియాను మంచికి, విజ్ఞాన్నాన్ని పెంపొందించుకునేందుకు వాడుకోవాలని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువవుతున్న తరుణంలో సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు నైపున్యాభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉద్యోగ అవకాశాలు రావడానికి సులభం అవుతుందని తెలిపారు. ఏకాగ్రతతో విద్యార్థులు 24 గంటలు చదవడం కంటే రెండు మూడు గంటలు కేటాయించినా తాము అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆట పాటల పై కూడా దృష్టి పెట్టడం వలన ఏకాగ్రత పెరుగుతుందన్నారు.
తిరుపతి, సత్యవేడు శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించే దిశగా షైనింగ్ అవార్డులను ఇవ్వడం శుభ పరిణామమని తెలిపారు. పేదరికం, అసమానతలు రూపు మాపాలంటే విద్య ద్వారానే సాధ్యమని ఆ దిశగా విద్యా శాఖా మంత్రి విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తున్నారని తెలిపారు.
యాదవ కార్పోరేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అనేక మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. పేద విద్యార్థులకు మంచి ఫలితాలు అందించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను ప్రవేశ పెట్టిందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన కూడా ఆశక్తి చూపించి మంచి భవిష్యత్తు అందిపుచ్చుకోవాలన్నారు.
నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలను తీసుకుని వస్తున్నదని తెలిపారు. పేదరికం వలన చదువు దూరం కాకూడని ఉద్దేశ్యంతో విద్యార్థులకు అవార్డులను అందజేయడం జరిగిందని తెలిపారు.
గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్య లేని వాడు వింత పశువు అనే సామెతను ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అక్ష రాస్యతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వస్తుందని ఆదిశగా ఈ రోజు పిల్లలను ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో షైనింగ్ అవార్డులను విద్యార్థులకు అందజేయడం జరిగిందని తెలిపారు. తల్లి తరువాత రెండవ స్థానం గురువుదని విద్యార్ధి లోని ఆశయాలను వెలికి తీసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ… ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందించడం చాలా సంతోషంగా ఉందని ఇంకా ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం 2024-25 విద్యాసంవత్సరంలో జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన 207 మంది 10 వ తరగతి, 40 మంది ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ తో పాటు రూ.20 వేల నగదు మెడల్స్ ను ఇన్చార్జి మంత్రి కలెక్టర్, ఎంఎల్ఏ తదితరులతో కలిసి అందచేశారు
ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ. కె.వి.ఎన్ కుమార్, సర్వ శిక్ష అభియాన్ సి.ఎం.ఓ. సురేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News