గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్లపై ఉన్న కల్వర్ట్ ల వద్ద గ్రిల్స్ ఏర్పాటు చేసి, వ్యర్ధాలను ఎక్కడిక్కడ అడ్డుకొని తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ పండరీపురం, కృష్ణ నగర్, బ్రాడీపేట, విద్యా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాలు డ్రైన్లలోకి రాకుండా మేజర్ డ్రైన్ల కల్వర్ట్ ల వద్ద గ్రిల్స్ ఏర్పాటు చేయడం ద్వారా అడ్డుకోవాలని, తద్వారా డ్రైన్లు పొంగి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడవచ్చన్నారు. కనుక మేజర్ డ్రైన్లలో మైనర్ డ్రైన్లు కలిసే ప్రాంతాల్లో మెష్ లు, గ్రిల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏఈలను ఆదేశించారు. అలాగే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున, చెత్త రోడ్ల మీద డంప్ కాకుండా ప్రతి ఇంటి నుండి ప్రజారోగ్య కార్మికులు వ్యర్ధాలు సేకరించాలన్నారు. వార్డ్ సచివాలయాల పరిధిలో పారిశుధ్యం పక్కాగా ఉండేలా శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు భాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల్లో నాణ్యత లేకుంటే బిల్లులు చెల్లింపు జరగదని స్పష్టం చేశారు. ఏఈలు, ఎమినిటీ కార్యదర్శులు పనులు జరిగే ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. పూడికతీత పనులను నూరు శాతం నాణ్యతా ప్రమాణాలు పాటించేలా డిఈఈలు, ఈఈలు పరిశీలించాలని ఆదేశించారు. పర్యటనలో ఏసిపి రెహ్మాన్, డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ ఎన్వీఎస్ ప్రసాద్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News