మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి జిల్లాలో స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్వచ్ఛ ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్ లు, సమస్యలు, తదితర ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి అంశాలు ఏమైనా ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటర్ల జాబితా స్వచ్చీకరణ, క్లెయిమ్ లు, అభ్యంతరాల పరిష్కారం, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పులు చేర్పులు వంటి అంశాలపై తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం జూన్ 14 నాటికి మార్పులు, చేర్పులు చేపట్టిన అనంతరం జిల్లాలో 7,46,647 మంది పురుష ఓటర్లు, 7,94,586 మంది స్త్రీలు, 50 మంది థర్డ్ జెండర్ కలిపి మొత్తం 15,41,283 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ బూత్ వివరాలు తెలిపే చిరునామాలో కులాల పేర్లతో కూడిన పదాలను వాడకుండా చూడాలని, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన పత్రాలలో కొన్ని ఆంగ్ల పదాలను తెలుగు భాషకు తర్జుమా చేసే క్రమంలో సరైన పదాలను వాడాలని పలువురు రాజకీయ ప్రతినిధులు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారిని కోరారు.
స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారీలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించిన సలహాలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భారత్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు, మచిలీపట్నం ఆర్డీవో కే స్వాతి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పీవీ గజేంద్రరావు (బిజెపి), దిలీప్ కుమార్ (టీడీపీ), కొడాలి శర్మ (సిపిఐ(ఎం)), ఎస్. బాలాజీ (బీఎస్పీపి), మచిలీపట్నం ఉత్తర మండల తహసిల్దార్ నాగభూషణం, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News