-నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద జల యోగాసనాలు..
-తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయిన కార్యక్రమం
-కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ,..
నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే నేడు నాగాయలంక గ్రామంలో కృష్ణమ్మ ఒడ్డున జల యోగాసనాలు వేయడం ప్రజలందరికీ స్పూర్తి అని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో 188 మందితో జల యోగా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్దప్రసాద్, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొన్నారు.
యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి సూచనలతో నీటిపై తేలియాడుతూ ప్లవని ప్రక్రియతో వృక్షాసనం, శవాసనం, పద్మాసనం, వాయుదిగ్బంధనం తదితర ఆసనాలతో విన్యాసాలు చేస్తూ అబ్బురపరిచారు. అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ (అవారా) ఆధ్వర్యంలో రింగ్ సాయంతో చిన్నారుల ఆసనాలు, నాగాయలంక ఈత మిత్రులు, బావదేవరపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఊపిరిని నియంత్రిస్తూ నీటిలో వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. స్థానిక వాసులు రెండు కాళ్ళు లేని దివ్యాంగుడు రాము, టీ కొట్టు నడుపుకుంటున్న 53 ఏళ్ల లలిత, 7 ఏళ్ల చిన్నారి నిత్యశ్రీ ప్రియ నీటిలో పలు ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఈ విధమైన జల యోగాసనాలను ఎక్కడా వేయలేదని, దీన్ని అరుదైన కార్యక్రమంగా గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసి అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను ప్రతినిధి శంకరాచారి అందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. యోగ ప్రాముఖ్యత పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో స్థానిక శాసనసభ్యుల ఆలోచనతో నాగాయలంకలో వినూత్నంగా నీటిలో యోగాసనాలు వేసే విధంగా జల యోగ కార్యక్రమం నిర్వహించామని, ఇది జిల్లా ప్రజానీకానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆసనాలు వేసి అబ్బురపరిచారని, వారు దీనిని మరింత సాధన చేస్తూ భవిష్యత్తులో స్విమ్మింగ్ లో ఒలంపిక్స్ పతకాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ సంధ్యా సమయాన ఆహ్లాదకరమైన వాతావరణంలో నీటిలో యోగాసనాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. నిలకడగా లేని నీటి ఉధృతిలో ఆసనాలు సునాయాసంగా వేసి అబ్బురపరిచారని, వారి ప్రదర్శన స్ఫూర్తిదాయకమన్నారు. యోగ భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం అని, 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, ఆ రోజున విశాఖపట్నం బీచ్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర లక్షల మందితో నిర్వహిస్తుందన్నారని, ఆ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి పాల్గొంటారన్నారు. అంత గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న యోగాను ప్రతి ఒక్కరు వారి జీవన శైలిలో భాగం చేసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.
శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంగా భారత దేశంలో యోగా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, ఎక్కడా జరగని విధంగా జల యోగాసనాలు మాత్రం నాగాయలంకలోనే జరగడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ ప్రాంతం జల క్రీడలకు అనువైన ప్రాంతంగా ప్రభుత్వం అప్పట్లో గుర్తించి జల క్రీడల కేంద్రం ఏర్పాటు చేసిందన, అనివార్య కారణాల చేత అది పూర్తి కాలేదని, అయితే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రోద్బలంతో రూ.2 కోట్ల నిధులతో జల క్రీడల కేంద్రం ఏర్పాటు కానున్నదని, త్వరలోనే అందుకు సంబంధించిన భవనం పూర్తి కానున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం జల క్రీడలకు తర్ఫీదు నిచ్చే కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
యోగాసనాలు వేసే సమయంలో నీటిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చుట్టూతా గజ ఈతగాళ్లతో కూడిన పడవలను ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర్ రావు, యోగాంధ్ర కార్యక్రమ సమన్వయ అధికారి డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, బందరు ఆర్డిఓ కే స్వాతి, మెప్మా పీడీ సాయిబాబు, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, తాసిల్దార్ హరనాథ్, ఆయుష్ శాఖ అధికారులు వాహిని, శేష ప్రసన్న, మత్స్య శాఖ అధికారి నాగరాజు, ఇతర అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News