ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉయ్యూరు శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థల యాజమాన్యాన్ని కోరారు. సోమవారం ఉదయం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఉయ్యూరు మండలంలోని శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థలను సందర్శించారు. సంస్థ చైర్మన్ మాదల సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యశేఖర్ తదితరులతో చైర్మన్ చాంబర్లో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి–4 కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు.
పి–4 ఒక వినూత్నమైన కార్యక్రమం అని పేర్కొంటూ, జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన ధనికులను గుర్తించి, వారిని బంగారు కుటుంబాలతో ఆన్లైన్లో అనుసంధానం చేసి, పేదలను దత్తత తీసుకొని వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం అన్నారు. బంగారు కుటుంబాలుగా గుర్తించిన వారిలో అవసరం ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయడం, వస్తు సేవల రూపంలో చేయూత అందించడం, పిల్లల చదువుకు ఖర్చును భరించడం, ఇళ్ళ నిర్మాణాలకు సహకారం అందించడం, ఉపాధి కల్పించడం తదితర సేవలను మార్గదర్శకుల ద్వారా అందించి పేదల స్థితిగతులను మార్చాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయం చేసేందుకు గానూ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ చాప్టర్ అనే ఆన్లైన్ వేదిక ఏర్పాటు చేశామని, దీనిలో అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ప్రముఖ వ్యక్తులు, సామాజిక కార్యకర్తలు తదితర అనధికారిక వ్యక్తులు ఉంటారన్నారు.
ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ సామాజిక స్పృహ కలిగిన శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థలు ఈ కార్యక్రమంలో మరింత భాగస్వామ్యం కావాలని, పేదరిక నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. జిల్లాలో తాము గుర్తించిన గ్రామాలలో నచ్చిన గ్రామం లేదా కుటుంబాలను దత్తత తీసుకోవాలని, లేదా సంస్థలోని బోధనేతర సిబ్బంది, తోటపని, పారిశుద్ధ్యం, వంట చేసేవారు, డెయిరీలో పని చేసేవారిని దత్తత తీసుకొని వారి అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. అదేవిధంగా దేశ విదేశాల్లో జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల జాబితా అందించాలని, దీని ద్వారా పి–4 కార్యక్రమానికి వారి సహకారం కోరుతామన్నారు.
పి–4 కార్యక్రమంపై స్పందించిన సంస్థ చైర్మన్ మాట్లాడుతూ కార్యక్రమం లక్ష్యం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కుల మత ప్రాంత పార్టీలకతీతంగా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారి ఉండటం జిల్లాకు ఎంతో గర్వకారణమని ఆయన ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సమావేశంలో కె ఆర్ ఆర్ సి ఎస్డీసి కలెక్టర్ శ్రీదేవి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మార్క్ ఫెడ్ డిఎం మురళీ కిషోర్, మండల ప్రత్యేక అధికారి జె జ్యోతి, శ్రీ విశ్వశాంతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాదల సుష్మ, ప్రిన్సిపల్ పద్మజావాణి, వైస్ ప్రిన్సిపల్ రుద్ర కుమారి, సిపిఓ ఎస్ భీమరాజు, డిఎల్డీఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News