Breaking News

సీజ‌న‌ల్ వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

– ప్ర‌జ‌ల‌కు విస్తృతస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించండి
– ఏ ఒక్క కేసునూ నిర్ల‌క్ష్యం చేయొద్దు
– యాంటీ లార్వాల్ ఆప‌రేష‌న్స్‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి
– డ్రైడే-ఫ్రైడే కార్య‌క్ర‌మాల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించండి
– విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం క‌నిపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ‌ర్షాకాలంలో సీజ‌న‌ల్ వ్యాధులు, జ్వ‌రాలు ప్ర‌బ‌ల‌కుండా అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. డెంగీ, మ‌లేరియా, డ‌యేరియా కేసులు న‌మోదుకాకుండా క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు.
సీజ‌న‌ల్ వ్యాధుల‌తో పాటు ఉపాధి హామీ ప‌థ‌కం అమ‌లు, ఉద్యాన పంట‌ల పెంప‌కం అంశాల‌పై క‌లెక్ట‌ర్ లక్ష్మీశ బుధ‌వారం క‌లెక్ట‌రేట్ నుంచి ఆర్‌డీవోలు, త‌హ‌సీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, వైద్యాధికారులు త‌దిత‌రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఎక్క‌డైనా వ్యాధి కేసు న‌మోదైతే పరిసర ప్రాంతాలలో ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించి, నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. క్ర‌మంత‌ప్ప‌కుండా పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతో పాటు ఎక్క‌డా వ‌ర్ష‌పునీరు నిలిచిపోకుండా చూడాల‌న్నారు. యాంటీ లార్వాల్ ఆప‌రేష‌న్స్‌ను విస్తృత స్థాయిలో చేప‌ట్టాల‌ని ఆదేశించారు. జ్వ‌రాల కేసుల స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు క‌లెక్ట‌రేట్‌లోని క‌మాండ్ కంట్రోల్ రూమ్‌కు అందిస్తే అక్క‌డి నుంచి ఆయా ప్రాంతాల క్షేత్ర‌స్థాయి బృందాల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌మ‌న్వ‌యం విష‌యంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే స‌హించేది లేద‌ని హెచ్చరించారు. డ్రైడే ఫ్రైడే కార్య‌క్ర‌మాల‌ను ప్రాణంపెట్టి చేయాల‌ని.. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. దోమ‌ల నియంత్ర‌ణ‌తో పాటు సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాపించ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై క‌ర‌ప‌త్రాలు, డిజిటల్ కంటెంట్‌, వీడియో షార్ట్ క్లిప్పింగ్స్ వంటివాటితో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆదేశించారు. అదేవిధంగా ప్ర‌జా భాగ‌స్వామ్యంతో ప్ర‌త్యేకంగా ర్యాలీలు వంటివి నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. తాగునీటి వాట‌ర్ సోర్స్‌ల‌తో పాటు ఫిల్ట‌ర్ పాయింట్ల‌ను నిరంత‌రం త‌నిఖీ చేయాల‌ని.. ఎక్క‌డా క‌లుషితమ‌య్యే ప‌రిస్థితి రాకుండా చూడాల‌న్నారు. ప్ర‌త్యేక శానిటేష‌న్ డ్రైవ్‌లు చేప‌ట్టాల‌ని.. ఓవ‌ర్‌హెడ్ రిజ‌ర్వాయ‌ర్ల క్లీనింగ్‌, క్లోరినైజేష‌న్ స‌క్ర‌మంగా జ‌రిగేలా చూడాల‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో ఏఎన్ఎం, ఆశా, స‌చివాల‌య సిబ్బందితో అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు.

4 వేల ఎక‌రాల ల‌క్ష్యంలో ఒక్క సెంటూ త‌గ్గ‌డానికి వీల్లేదు:
ఉపాధి హామీ ప‌థ‌కం ఆస‌రాతో ఉచితంగా పండ్ల తోట‌ల పెంప‌కాన్ని చేప‌ట్టేలా ప్రోత్స‌హించి రైతుకు మంచి ఆదాయం వ‌చ్చేలా చేయాల‌ని, దీనికి సంబంధించి నిర్దేశించిన నాలుగు వేల ఎక‌రాల ల‌క్ష్యంలో ఒక్క సెంటు కూడా త‌గ్గ‌డానికి వీల్లేద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు త‌దిత‌రులు రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, ప్రోత్స‌హించాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికి దాదాపు 50 శాతం లక్ష్యాల‌ను చేరుకున్నందున మిగిలిన ల‌క్ష్యాన్ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేరుకునేందుకు కృషిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌న్న చిన్న‌కారు రైతుల‌ను పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు ఇదో గొప్ప మార్గ‌మ‌ని.. ఈ కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకునేలా వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌, ఉపాధి హామీ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని ఆదేశించారు.
స‌మావేశంలో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి, డ్వామా పీడీ ఎ.రాము, డీపీవో పి.లావ‌ణ్య‌కుమారి, ఇన్‌ఛార్జ్ డీఎంహెచ్‌వో డా. జె.ఇందుమ‌తి, జిల్లా మ‌లేరియా అధికారి వి.మోతిబాబు,
డా. ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్ర‌స్ట్ కోఆర్డినేట‌ర్ డా. జె.సుమ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *