Breaking News

నగరంలో మోడల్‌ ఫ్లవర్‌ మార్కెట్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు…

-ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఫ్లవర్‌ మార్కెట్‌ నిర్మాణం…
-జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హోల్‌ సేల్‌ రిటైల్‌ పూల వ్యాపారులు, వినియోగదారులకు అమోద యోగ్యంగా మోడల్‌ ఫ్లవర్‌ మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని, నిబంధనలకు లోబడి హోల్‌ సేల్‌ పూల మార్కెట్‌ వర్తక సంక్షేమ సంఘమే మార్కెట్‌ నిర్మాణం చేసుకుని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

హోల్‌ సేల్‌ పూల మార్కెట్‌ వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూల మార్కెట్‌ నిర్మాణంపై మంగళవారం జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ కలెక్టరేట్‌లోని ఆయన సమావేశ మందిరంలో మార్కెటింగ్‌, ఉద్యాన, నగరపాలక సంస్థ, పూల వర్తక సంఘం ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం జి.ఎస్‌ రాజు రోడ్డులోని రైతు బజారుకు సంబంధించిన 80 సెంట్ల స్థలంలో హోల్‌ సేల్‌ పూల మార్కెట్‌ను నిర్మించాలనే ఆలోచన చేయడం జరిగిందన్నారు. 2023లో ఏర్పాటు చేసిన జి.ఎస్‌ రాజు రోడ్డులోని రైతు బజారుకు కేధారేశ్వర పేట రైతు బజారు సమీపంలో ఉండుట వలన వినియోగదారులు జి.ఎస్‌.రాజు రోడ్డు రైతు బజారుకు వచ్చేందుకు ఆసక్తి చూపటం లేదన్నారు. కేవలం 10 నుంచి 15 స్టాల్స్‌ మాత్రమే రైతులు వ్యాపారం చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితులలో సంబంధిత రైతు బజార్‌ను తొలగించి అదే ప్రదేశం హోల్‌ సేల్‌ పూల మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం విజయవాడ నగర పాలక సంస్థ సమీపంలో గల హోల్‌ సేల్‌ పూల మార్కెట్‌ రైల్వే స్థలంలో ఉన్నందున ఆ స్థలాన్ని అప్పగించాలని రైల్వే అధికారులు కోరిన నేపథ్యంలో పూల రైతులు, రిటైల్‌ వర్తకులు, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా పూల మార్కెట్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు చెందిన పూల తోటల రైతులు, చుట్టు పక్కల పూల రైతులకు అందుబాటులో ఉండేలా జి.ఎస్‌. రాజు రోడ్డు రైతు బజార్‌ స్థలంలో మోడల్‌ ఫ్లవర్‌ మార్కెట్‌ను ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించనున్నామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మోడల్‌ ఫ్లవర్‌ మార్కెట్‌ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును హోల్‌ సేల్‌ పూల మార్కెట్‌ వర్తకు సంక్షేమ సంఘమే చెల్లించాల్సి ఉంటుందని, సంఘ సభ్యులకు మాత్రమే షాపులను కేటాయించాలని, 10 శాతం షాపులు ప్రభుత్వ నిర్వహణకు అప్పగించాల్సి ఉంటుందన్నారు. స్థలం అద్దె ప్రాతిపదికన కేటాయిస్తామని ప్రతి మూడు సంవత్సరాలకు 10 శాతం అద్దె పెంపు ఉంటుందన్నారు. వినియోగదారులతో పాటు నగరానికి విచ్చేసే సందర్శకులు పర్యాటకులను ఆకర్షించే రీతిలో మోడల్‌ ఫ్లవర్‌ మార్కెట్‌ను నిర్మించాల్సి ఉంటుందన్నారు. హోల్‌ సేల్‌ పూల వర్తకుల సంఘ ప్రతినిధులు, అధికారులు రాజమండ్రి సమీపంలోని కడియం పూల మార్కెట్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన మోళిక వసతులను పరిశీలించి మరింత మెరుగైన సౌకర్యాలతో దేశంలోనే మోడల్‌ పూల మార్కెట్‌గా నిర్మించేలా ముందుకు వస్తే అనుమతులకై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరగుతుందని కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ .బి. రాజాబాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె. బాలాజీ కుమార్‌, నగరపాలక సంస్థ ఎస్టెట్‌ అధికారి ఎ. శ్రీధర్‌ హోల్‌ సేల్‌ పూల మార్కెట్‌ వర్తక యాజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సైయద్‌ రఫీ ఉప అధ్యక్షులు జి. అశోక్‌ కుమార్‌ కార్యదర్శి పి.ఎస్‌.డి. ప్రకాష్‌, సంయుక్త కార్యదర్శి ఎ. ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *