మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందుతున్న మీకోసం అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, అదనపు ఎస్ పి సత్యనారాయణ, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి శ్రీదేవి, మచిలీపట్నం ఆర్ డి ఓ కే స్వాతి, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజులతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక –మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.
మరి ముఖ్యంగా దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో వేదికనుండి కిందికి దిగి వారి వద్దకే వచ్చి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
ఆ ప్రకారం కలెక్టరేట్లో మొత్తం 194 అర్జీలు అందాయి. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
పెడనకు చెందిన దివ్యాంగురాలు పడమట పద్మ మీకోసం సమావేశం మందిరం తాపల వద్దకు రాగా జిల్లా కలెక్టర్ వేదిక నుండి దిగి ఆమె వద్దకు వచ్చి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ తో మాట్లాడుతూ తనకు ఎలాంటి వాహనము లేదని, నిరుపేదనని, బ్యాటరీ స్కూటర్ అందజేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ వృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు స్కూటీ అందించిన జిల్లా కలెక్టర్
గుడివాడకు చెందిన దివ్యాంగులు కొడాలి పోతురాజు తాను చెప్పులు కుట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని, దానికోసం తనకు మూడు చక్రాల మోటార్ వాహనను మంజూరు చేయాలని గత జూన్ నెల 30వ తేదీన కోరడంతో జిల్లా కలెక్టర్ వెంటనే ముఖ్య ప్రణాళిక అధికారి వద్ద ఉన్న సి ఎస్ ఆర్ నిధులనుంచి 1,15,285 రూపాయలు మంజూరు చేయగా దాంతో టీవీఎస్ జస్ట్ మ్యాటీ రకం మూడు చక్రాల స్కూటీని జిల్లా కలెక్టర్ సోమవారం అందజేశారు. దీంతో లబ్ధిదారుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతను జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగులకు న్యాయసహాయం కల్పించిన కలెక్టర్
మండల కేంద్రమైన తొట్లవల్లూరుకు చెందిన దివ్యాంగురాలు పెద్ద అమ్మాజీ చక్రాల కుర్చీలో మీకోసం సమావేశం మందిరం వద్దకు రాగా జిల్లా కలెక్టర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన మేనకోడలు శివలక్ష్మి తనను మోసం చేసి 25 సెంట్లు స్థలాన్ని రాయించుకున్నారని తన గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదని తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో ఉచితంగా న్యాయ సహాయం అందిస్తారని అక్కడికి వెళ్లాలని తెలియజేస్తూ సీనియర్ సివిల్ జడ్జి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్యను సంప్రదించారు. వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించి తగిన న్యాయం చేయాలని కోరారు.
పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో సర్వే నంబర్ 124/1లో సాయిపురం గ్రామానికి గతంలో ఎడ్ల బండ్లు, రైతులు రాకపోకలకు రహదారి ఉండేదని, రైతులు తమ 200 ఎకరాల పొలాలు సాగుకు వెళ్లేవారని గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు ఎస్సీల స్మశాన భూమి అంటూ రాకపోకలకు వీలు లేకుండా సిమెంట్ స్తంభాలు పాతారని దీంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తమకు న్యాయం చేయాలని సామాజిక కార్యకర్త జంపన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పలువురు రైతులు జిల్లా కలెక్టర్ కు అర్జీ అందజేసి విజ్ఞప్తి చేశారు.
తోట్లవల్లూరు మండలం కుమ్మమూరు గ్రామానికి చెందిన బొప్పన గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో 1500 మంది నివసిస్తున్నారని, గ్రామానికి తూర్పు వైపున డ్రైనేజీ కోడు పూర్తిగా ఆక్రమణకు గురై డ్రైనేజీ పూడుకుపోయినదని, గ్రామంలో ఉన్న మురుగునీరు అధిక వర్షాలకు ముంపుకు గురై ప్రజలకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఆర్ అండ్ బి రోడ్డు పక్కనే ఉన్నందున సుమారు 35 మంది ఆక్రమణదారులు రోడ్డును ఆక్రమించి రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ డ్రైనేజీ కోడులో ఉన్న నీటిని కలుషితం చేస్తున్నారని, కుమ్మమూరు గరికపురం సరిహద్దుల్లో ఉన్న ఈ కోడు విడగొట్టి ఆక్రమణదారులను తొలగించి న్యాయం చేయవలసినదిగా కోరుతూ అర్జీ అందజేశారు.
మండల కేంద్రమైన కోడూరులో నివసిస్తున్న గోసాల నిర్మల తన పొలానికి సంబంధించిన సర్వే చేయాలని అర్జీ పెట్టుకున్నామని, సర్వే కొలతలు సరిగా వేయలేదని, సర్వే రాయి మీద ప్రహరీ గోడ కట్టి తమను చాలా ఇబ్బంది పెడుతున్నారని, సర్వేయర్ లను పంపి కొలతలు వేయించవలసిందిగా కోరుతూ అర్జీ అందజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఈనెల 16వ తేదీన మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో నేషనల్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పై రూపొందించిన గోడ పత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కే. కన్నమ నాయుడు, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, రహదారులు భవనాలు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ లు లోకేష్, నటరాజు డీఎం హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ట, డిపిఓ జే అరుణ, డ్వామా పిడి శివప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్ రావు, డి టి డబ్ల్యూ ఓ పని దూర్చటి, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, ఉద్యాన అధికారి జే జ్యోతి, వృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News