మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించుటకు తప్పనిసరిగా బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ముందస్తు కార్యక్రమం పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ముందస్తు కార్యక్రమం జిల్లాలో చేపట్టడం జరిగిందన్నారు.
ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఇదివరకు మాదిరిగా కాకుండా ఈసారి పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు రోజంతా పూర్తిగా ఉంటాయని, సాయంత్రం 4:30 గంటలకు ఎన్నికల సంఘం వారు పరీక్షలు నిర్వహిస్తారన్నారు.
ఎవరైనా అనుత్తీర్ణులైతే వారికి మరల శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
ఏ ఈ ఆర్ వో లు, బూతు స్థాయి అధికారులు, సూపర్వైజర్లకు ఈనెల 15వ తేదీన ఓటర్ల జాబితా తయారీ, తాజా మార్గదర్శకాలు చట్టాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
పోలింగ్ కేంద్రాలలో 1200 మంది ఓటర్లకు మించి ఉంటే హేతుబద్ధీకరణ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలలో 189 పోలింగ్ కేంద్రాల్లో 1200 మంది ఓటర్లకు మించి ఉన్నారన్నారు.
ఈనెల 20 వ తేదీ నాటికి ఓటరు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా తయారవుతుందని, ఆ జాబితా ఈనెల 21వ తేదీన అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈనెల 30వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల జాబితా పై ఏమైనా అభ్యంతరాలు గాని సలహాలు గాని ఉంటే స్వీకరిస్తామన్నారు.
వచ్చే ఆగస్టు నెల 2 వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశం నిర్వహించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా పై చర్చించి సలహాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఆ సలహాలను జోడించి వచ్చే ఆగస్టు నెల 5 వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాల జాబితా తయారు చేస్తామన్నారు.
ప్రత్యేక సంక్షిప్త సవరణ లో కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా తయారీ, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అయ్యాక బూతు స్థాయి అధికారి వెంట ఇంటింటికి రాజకీయ పార్టీల తరఫున బూత్ స్థాయి ఏజెంట్ లు పరిశీలన జరిపి 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లను, చనిపోయిన ఓటర్లను గుర్తించి తదనుగుణంగా ఓటర్ల జాబితాలో మార్పు చేయాల్సి ఉంటుందన్నారు.
ఇందుకోసం గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ వారికి సంబంధించిన బూతు స్థాయి ఏజెంట్లను వెంటనే తప్పనిసరిగా నియమించాలన్నారు. అది వారి కనీస బాధ్యత అన్నారు.
అప్పుడే తప్పులు లేని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించుటకు వీలవుతుందన్నారు.
ఏజెంట్లను నియమించకుండా ఏదో జరిగిందని ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.
మంచి ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, సిపిఐ ఎం భారత జాతీయ కాంగ్రెస్, బి.ఎస్.పి, తెలుగుదేశం, వైయస్ఆర్సీపీ పార్టీల ప్రతినిధులు కొడాలి శర్మ, అబ్దుల్ మస్తాన్, బాలాజీ, బత్తిన దాసు, షేక్ సిలార్ దాదా, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News