-సాంఘిక సంక్షేమ వసతి గృహాలు!!..
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగ వయోవృద్ధులు, సచివాలయ, గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
-పేదల సంక్షేమం, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త :
పేద విద్యార్థుల భవితకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు సోపానాలుగా నిలుస్తున్నాయని.. వసతి గృహం లోని బాలికలందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగ వయోవృద్ధులు, సచివాలయ, గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
ఒకరోజు పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన మంత్రివర్యులు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి స్థానిక గిరినాథ్ సెంటర్ లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహం 1&2 ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఒక్కొక్క గదిలో ఎంతమంది బాలికలు ఉన్నారు, ఏయే తరగతి వారు వసతిగృహంలో ఉన్నారు, గదులన్నీ శుభ్రంగా ఉన్నాయా, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజు బాలికలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా, వంటగది, వంట పాత్రలు శుభ్రం చేసే ప్రదేశాలు, బాత్రూములు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా, లేదా, వాటి నిర్వహణ, ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్న వేళలు, వసతి గృహ నిర్వాహకుల పనితీరు తదితర అంశాలలో వసతి గృహంలోని బాలికలను, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమాన్ని అందిపుచ్చుకొని పేద విద్యార్థులు ముఖ్యంగా బాలికలందరు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని మంత్రి ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పేదల సంక్షేమం, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను అర్హులైన పేద వినియోగం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో చదువుకుంటూ వసతి గృహాల్లో ఉంటే ఎలాంటి ఖర్చులు లేకుండా నాణ్యమైన విద్య, భోజనంతో కూడిన సౌకర్యాలు లభిస్తాయన్నారు.
అనంతరం వసతి గృహంలోని బాలికలతో కలిసి మంత్రివర్యులు, కలెక్టర్ భోజనం చేసి ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారులు, హాస్టల్ వార్డెన్స్, వసతి గృహ నిర్వాహకులు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News