-కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తదితరులు..*
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలోని చాపిరి గ్రామంలో బుధవారం నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టి.డి.పి.” కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి , స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ముందుగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి, ఎమ్మెల్యే, తదితరులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి, ఎమ్మెల్యేలు ప్రజలకు సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ చాపిరి గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు చూపిన ఆదరణకు మనస్ఫూర్తిగా ధన్యవాదాల తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రగా 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు, విజయం మా బాధ్యతను ఎంతగానో పెంచాయన్నారు. గత ప్రభుత్వంలో గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకుంటున్నారని, కానీ మీరు గమనిస్తే అధికారంలోకి వచ్చాక పెన్షన్ ని నాలుగు వేలకు పెంచి ఏడాది కాలంలో ఒక్కొక్కరికి 48 వేల రూపాయలు అందజేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఉన్న అందరూ చదువుకుంటున్న పిల్లలకు 15 వేలు రూపాయలు జమ చేశామన్నారు. వచ్చే ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20 వేల రూపాయలు అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. హెచ్.ఎల్.సి కెనాల్ లో 2,400 క్యూసెక్కుల నీరు ప్రవహించలసి ఉంటే 35 కోట్ల రూపాయల ఖర్చు చేసి మరమ్మతులు చేపట్టి 2,000 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా చర్యలు చేపట్టామని, దీనిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. హంద్రీనీవా సృజల స్రవంతికి 3,800 కోట్ల ఖర్చుతో కాలువ వెడల్పు చేసి నీరు అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. బిటిపి కాలువ పనులు పునఃప్రారంభోత్సవం చేసి ఎమ్మెల్యే సొంత నిధులతో పనులు చేపట్టారని, ఎగువ పెన్నా గేట్ల మరమ్మతులు చేశామన్నారు. పవన విద్యుత్, సౌర విద్యుత్ ను ప్రోత్సహించే విధంగా పలు రాయితీలు అందిస్తూ.. సీమలో పరిశ్రమలు, సోలార్, విండ్ మిల్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లు నిరంతరం శ్రమిస్తూ భరోసా కల్పించి, నూతన పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం చేస్తామన్నారు. గ్రామంలో కొండ మీద ఇళ్లు ఉన్నవారికి కొత్తగా స్థలాలు, ఇళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, కొత్త రేషన్ కార్డులు, అర్హత ఉన్న వారికి కొత్త పెన్షన్లు అందిస్తామన్నారు. గ్రామంలో తప్పకుండా కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్డి ఎంతో వెనుకబడి పోయిందని, తమ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చాపిరి గ్రామంలో రాళ్ల గుట్టపై ఉన్నామని ఇళ్లు కావాలని చాలామంది అడుగుతున్నారని, గ్రామంలో రాళ్ళగుట్టపై ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి చర్యల కొరకు మంత్రిని కోరడమైనదన్నారు. చాపిరి గ్రామానికి దగ్గరలోని చెరువులో మొదట నీరు రావాల్సి ఉందని, గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని, గత ఆరు నెలలుగా నేను ఈ అంశాన్ని స్టడీ చేసి చెరువుకు నీరు వచ్చేలా సీఎం దృష్టికి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి చెరువుకు నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు కృషి చేస్తామన్నారు. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్యపై పరిష్కార చర్యలు తీసుకుంటాం. మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలోని అందరూ చదువుకుంటున్న పిల్లలకు నిబంధనల మేరకు వారి ఖాతాల్లో డబ్బు జమ చేశామని, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు వారి నియోజక వర్గంలో గడప గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన అందిస్తున్న అంశాలు వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. గ్రామంలో 35 లక్షల రూపాయలను సిసి రోడ్లు కోసం, మాదిరెడ్డిపల్లిలో సిసి రోడ్ల కోసం 20 లక్షల రూపాయల మంజూరు చేయించామని తెలిపారు. అంతకుముందు దొడగట్ట గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి, ఎమ్మెల్యే, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News