గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయిలో గుంటూరు ఖ్యాతిని చాటేలా హర్ ఘర్ తిరంగా 10 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిలిచేలా సమిష్టి కృషితో విజయవంతం చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి ఈ నెల 14న చేపట్టనున్న హర్ ఘర్ తిరంగా జాతీయ జెండా ప్రదర్శనపై జిఎంసి, విద్యా శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
తొలుత కమిషనర్ చాంబర్ లో మేయర్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్, జిఎంసి ఎస్ఈ, సిటి ప్లానర్, ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ లు 14వ తేదీ చేపట్టే జాతీయ జెండా ప్రదర్శనకు గుర్తించిన రోడ్లు, ట్రాఫిక్ అంశాలపై చర్చించి, నగరంలో మదర్ థెరిస్సా విగ్రహం నుండి ఎల్వీఆర్ క్లబ్, కోరేటేపాడు జంక్షన్, ఐటిసి హోటల్, జెకేసి కాలేజి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్-ఫేజ్ 2, చిల్లీస్ ధాబా జంక్షన్, లాడ్జి సెంటర్ ద్వారా తిరిగి మదర్ థెరిస్సా విగ్రహం వరకు రూట్ మ్యాప్ ని సిద్దం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాత్మకంగా గుంటూరు నగరంలో తొలిసారిగా 10 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన జరగనున్నదని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్ధులు పాల్గొని, సమిష్టిగా విజయవంతం చేయాలని కోరారు. అతి పెద్ద జాతీయ జెండా ప్రదర్శన ద్వారా గుంటూరు నగరం జాతీయ స్థాయిలో ఖ్యాతిని చాటుతుందన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ ఆజాదీ అమృతోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలకు 10 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన చేపడుతున్నామన్నారు. జాతీయ జెండా ప్రదర్శనలో నిర్దేశిత ప్రోటోకాల్ పాటించాలన్నారు. కార్యక్రమ విజయవంతంకు విద్యాశాఖ, జిఎంసి అధికారులు కేటాయించిన విధులను అంకిత భావంతో నిర్వహించాలని, నిర్లక్ష్యంగా ఉండేవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే హర్ ఘర్ తిరంగా లో భాగంగా ఈ నెల 13 నుండి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఇంచార్జి ఎస్ఈ సుందర్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News