గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశుభ్రతతో, పచ్చదనంతో, పర్యావరణహిత, సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుటకు రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
మంగళవారం శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో జరిగిన వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అండ్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటి క్యాంపెన్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, రాష్ట్ర గవర్నర్ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ డా. ఎం హరి జవహర్ లాల్, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ మరియు అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటి క్యాంపెన్ ను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దూల్ నజీర్ ప్రారంభించి, విధ్యార్ధులకు క్లాత్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు ఆచార్య నాగర్జున బోధనలు వినిపించిన ఘనమైన చరిత్ర ఉందని, ఇక్కడ అనేక మంది అనేక సాహితి వేత్తలు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులు జన్మించారన్నారు. గుంటూరు జిల్లా సాంస్కతిక, విద్యా , సామాజిక రంగాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని, ప్రసిధ్ద విద్యా కేంద్రాలతో పాటు ప్రజలకు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, అందువలనే ‘ఆంధ్రప్రదేశ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ మరియు అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్’ ప్రారంభోత్సవానికి గుంటూరు నగరాన్ని లాంచ్ ప్యాండ్ గా ఎంచుకున్నారన్నారు. ఈరోజు ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ప్రారంభించిన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో విజయవంతంగా అమలు జరుగుతుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణాన్ని రక్షించటానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించటానికి ప్రజల్లో అవగాహన కల్పించటంలో యువత కీలక పాత్ర పోషించాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రజల్లో అప్రమత్తత కల్పించటమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన భూ కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడి పర్యావరణం దెబ్బతినుటయే కాక ప్రజలు ఆరోగ్యం క్షీణిస్తున్నదని తెలిపారు. యూత్ రెడ్ క్రాస్ మరియు జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్లాస్టిక్ నివారణ ఉద్యమం గుంటూరులో ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జూనియర్ రెడ్ క్రాస్ సభ్యులందరికీ, యువ వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజల దైనందిన జీవితంలో ప్లాస్టిక్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన ఉన్న సమాజాన్ని నిర్మించాలన్నారు. ప్లాస్టిక్ ను నిర్మూలించటం పరిశుభ్రతకు సంబంధించిన విషయమే కాదని, బాధ్యతాయుతమైన సంస్కృతిని సృష్టించే అంశం అన్నారు. కేంద్ర గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, ప్రపంచంలో తలసరి ప్లాస్టిక్ వినియోగం సగటున 28 కిలోలు ఉండగా, భారతదేశంలో తలసరి ప్లాస్టిక్ వినియోగం 11 కిలోలు ఉందని, భారతదేశంలో ఏటా 3.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయడం వల్ల వివిధ రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులలో ఉండే సంకలనాలు, రంగులు, స్టెబిలైజర్లు మరియు ఫిల్లర్లు లీచ్ కావడం వల్ల నేల మరియు భూగర్భ జల నాణ్యత క్షీణిస్తుందన్నారు. అందువలన కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (సవరణ) నియమాలు, 2021 ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేదించిందన్నారు. అమరావతిని ప్లాస్టిక్ రహిత రాజధానిగా మార్చడమే దీర్ఘకాలిక లక్ష్యం అని, అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను సూచిస్తుందని, పరిపాలనా మరియు సాంస్కృతిక కేంద్ర బిందువుగా, ఇది పర్యావరణ అనుకూల అభివృద్ధికి జాతీయ ఉదాహరణగా ఉండాలన్నారు. పరిశుభ్రమైన, స్థిరమైన మరియు ప్లాస్టిక్ రహిత అమరావతి సాధించడమే కాదు, అది చాలా అవసరం అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించే ఈ ప్రచారంలో విద్యార్థుల నుండి ప్రారంభించి, గృహాలు, మార్కెట్లు మరియు ప్రజా సంస్థల వరకు ప్రజల భాగస్వామ్యంపై నిర్మించబడుతుందని, ఇది సంస్థలు, స్వచ్ఛంద సేవకులు మరియు పౌర సమాజాన్ని ఒకే ఉమ్మడి ప్రయోజనం కిందకు తీసుకువస్తుందన్నారు. ఈ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి అంకితభావం తో ప్రణాళికతో పనిచేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ, భాగస్వామ్య సంస్థలు మరియు విద్యా సంస్థలను అభినందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 52 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుండి ఐదు వేల మంది విద్యార్థులు మొదటి దశలో 50,000 గృహాలను దత్తత తీసుకొని ప్రతి ఒక్కరూ నెలలో ప్రతి మూడవ శనివారం వారు దత్తత తీసుకున్న పది గృహాలను సందర్శించి, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించరాదని, ఘన వ్యర్థాల వేరు చేసే విధానం, పారవేయటం మరియు చెట్ల పెంపకంపై వారికి అవగాహన కల్పిస్తారన్నారు. లక్ష మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ 10 లక్షల కుటుంబాలను కలిసి పర్యావరణం పై అవగాహన కల్పించి ప్లాస్టిక్ నివారణ కొరకు తీసుకోవలసినటువంటి చర్యలను వివరించి, మొక్కలు నాటి చెట్లుగా తీర్చిదిద్దే విధంగా శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరం నందు రెడ్ క్రాస్ రాష్ట్ర కోశాధికారి రామచంద్ర రాజు నాయకత్వంలో పైలెట్ ప్రాజెక్టుగా గుంటూరును ఎన్నుకున్నట్లు గవర్నర్ తెలిపారు. గుంటూరు నగరంలో 50 వేల మంది జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థుల ద్వారా వారి కుటుంబ సభ్యులను ప్రేరేపించి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు రెడ్ క్రాస్ కృషి చేస్తున్నదని తెలిపారు. రెడ్ క్రాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శనీయమని, ఈ సేవా కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొనవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. అన్ని యూనివర్సిటీల యొక్క వైస్ ఛాన్స్ లర్స్ రెడ్ క్రాస్ క్లైమేట్ యాక్షన్ టీమ్స్ ని ఏర్పాటు చేసి నెలలో ప్రతి మూడవ శనివారం పర్యావరణహిత కార్యక్రమాలను తయారు చేయాలని ఆయన తెలిపారు. వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రాజెక్టు విజయవంతం అవటానికి పూర్తి మద్దతును అందిస్తామన్నారు.
తొలుత రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఏపీ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ వై డీ రామారావు, జనరల్ సెక్రటరీ మరియు సీఈఓ ఏ కే పరీదా, కోశాధికారి పీ రామచంద్రరాజు, గుంటూరు జిల్లా బ్రాంచీ చైర్మన్ వడ్లమాని రవి , రెడ్ క్రాస్ సొసైటి వాలంటీర్లు , విద్యార్దులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News