మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మీకోసం అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కే చంద్రశేఖరరావు, కే ఆర్ ఆర్ సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీఎస్పీ జి శ్రీనివాసరావు, బందరు ఆర్డిఓ కే స్వాతితో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయానికి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండల స్థాయిలో నిర్వహించే మీకోసం కార్యక్రమంలో అధికారులందరూ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తూ, అవసరమైన వాటికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్లను సంబంధిత ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయడంలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయని వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. స్వచ్ఛఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు అక్టోబర్ రెండవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు అందిస్తుందని, ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు పేర్లను ప్రతిపాదించాలని సూచించారు. ఇదే క్రమంలో స్వచ్ఛ పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైతు బజార్లు, వసతి గృహాలు, పరిశ్రమలు వంటి వాటికి మార్కులు కేటాయించి అవార్డులు ఇవ్వడం జరుగుతుందని, వాటిని కూడా ప్రతిపాదించాలని అధికారులకు సూచించారు. దీనికి జిల్లా పరిషత్ సీఈఓ కన్నమనాయుడు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
మీకోసం అర్జీలలో కొన్ని:
హర హర మహాదేవ డ్వాక్రా గ్రూప్ సభ్యులకు చెందిన 13 నెలల పొదుపు నిధులు రూ.5.33 లక్షలు బ్యాంకులో జమ చేయకుండా ఈవో తన సొంత ఖర్చులకు వినియోగించుకుందని, తిరిగి చెల్లించడం లేదని, ఆ నగదును తమకు ఇప్పించి న్యాయం చేయవలసిందిగా ఉయ్యూరు మండలం, ఉయ్యూరు నగర పంచాయతీ, ఏ జి కె నగర్ 11వ వార్డుకు చెందిన డ్వాక్రా మహిళలు అర్జీ సమర్పించారు.
మచిలీపట్నం వైద్య కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద నుంచి నగదు వసూలు చేసి ఒక వ్యక్తి మోసం చేశాడని, సదరు వ్యక్తి నుంచి తిరిగి ఆ డబ్బును ఇప్పించవలసిందిగా మచిలీపట్నంలోని ముస్తాఖాన్ పేటకు చెందిన శీలం వెంకటేష్ అర్జీ ఇచ్చారు.
తాను రెండు ఎకరాలలో రొయ్యలు సాగు చేస్తున్నానని, ఇటీవల గ్రామంలోని కొంతమంది తాను లేని సమయంలో తన చెరువులోని రొయ్యలను వలవేసి తన పక్కనే ఉన్న వారి చెరువులో వేసుకున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని చిన్నాపురం యానాది కాలానికి చెందిన కొక్కిలిగడ్డ బాపనయ్య అర్జీ ద్వారా విన్నవించారు.
ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ఠ, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి నటరాజ్, సిపిఓ భీమరాజు, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News