గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మహిళల జీవనోపాదుల మెరుగుదలకు, వ్యాపారవేత్తలుగా అబివృద్ది చేయటానికి డీఆర్డీఏ – వెలుగు శాఖను సమన్వయం చేసుకుంటూ స్వయంసహాయక సంఘాలకు బ్యాంకర్లు సక్రమంగా రుణసహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.
బుధవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశమందిరంలో డీఆర్డీఏ-వెలుగు ఆధ్వర్యంలో బ్యాంకర్లుకు, ఎ.పి.యం.లు, సి.సి.లకు నిర్వహించిన వర్క్ షాపులో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ మహిళా సంఘాల పొదుపులను సభ్యుల అవసరాల కోసం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడుకునే వెసులుబాటు కల్పించాలని బ్యాంకు మేనేజర్ల తెలిపారు. అలానే వెలుగు డి.ఆర్.డి.ఎ సిబ్బంది మహిళా సంఘాలు ప్రతి నెల సక్రమముగా గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసుకునే విధముగా, పుస్తక నిర్వహణ సక్రమముగా నిర్వహించే విధముగా తీసుకున్న పొదుపు అప్పులను సక్రమముగా చెల్లించే విధముగా సిబ్బంది భాద్యత తీసుకోవాలన్నారు. ప్రతి చిన్న సంఘము రాబోవు రోజులలో ఒక మినీ బ్యాంకు వలె తయారు కావాలని సూచించారు. మన గుంటూరు జిల్లాలో సుమారు 20 వేల సంఘాలలో 2లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉంటూ ప్రతి సం.ము సుమారు రూ.850 కోట్లు రుణాలు పొందుతూ నూటికి 99% రుణాలు చెల్లిస్తూ ఉండడం విశేషమని, ఇది ఇతర బ్యాంకు అడ్వాన్స్ లతో పోలిస్తే అత్యుత్తమన్నారు. ఈ క్రమశిక్షణ, విశ్వసనీయత మహిళా సంఘాల బలాన్ని నిరూపిస్తోంది అని తెలియజేశారు. మహిళలను లక్ష్యాధికారులుగా అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లఖ్ పత్ దీదీ కార్యక్రమంను, రాష్ట్ర ప్రభుత్వం ఒన్ ఫ్యామిలీ, ఒన్ ఎంటర్ పెన్యూర్ కార్యక్రమంను అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తుందన్నారు. స్వయంసహాయక సంఘాల సభ్యులను వ్యక్తిగతంగా, గ్రూప్ గా ఆదాయం పెంపుదలతో పాటు, ఉపాధి కల్పించే యూనిట్లను ఏర్పాట్లను ప్రోత్సహించేలా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించిందని, దీనిలో భాగంగా జిల్లాలో 5,700 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యం నిర్దేశించిందన్నారు. దీని కోసం ప్రతి సీసీ కనీసం మహిళలతో వ్యాపారసంస్థల ఏర్పాటుకు 100 ధరఖాస్తులను చేయించాలన్నారు. మహిళలను వ్యక్తిగతంగా వ్యపారవేత్తలుగా తీర్చిదిద్దటంతో పాటు, గ్రూప్ సభ్యులతో ఎంటర్ ప్రైజేస్ గా అభివృద్ది చేయటం ద్వారా ఆదాయం వృద్ది చెందటంతో పాటు, ఇతరులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో గత 25సం. లుగామహిళా సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమానికి అద్భుతమైన సహకారం అందించిన అందరు బ్యాంకు మేనేజర్లను మరియు డి.ఆర్.డి.ఎ వెలుగు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని, ఇదే స్పూర్తితో భవిష్యత్తులోను మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృధ్ది చేయటంలో జిల్లాను దేశ, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సర లక్ష్యాలలో భాగంగా ప్రతి మహిళా స్వయం సహాయక సంఘం కుటుంబంలో కనీసం ఒకరిని వ్యాపారవేత్తను తయారు చేయాలని, ఒక లక్ష మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత కల్పించి వారి రోజువారీ ఆర్థిక నిర్ణయాలలో చైతన్యం కల్పించడం, మహిళా సంఘాలు జీవనోపాధుల ఏర్పాటుకు అవసరమైనంత ఋణం కావలసిన నెలలో అప్పు తీసుకునే సౌలభ్యత, సభ్యురాలి బయోమెట్రిక్ ఆధారముగా డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా ఋణం కల్పించాలన్నారు.
డీఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మీ మాట్లాడుతూ 2025-26 ఆర్ధిక సం.ము వార్షిక రుణ మరియు జీవనోపాధుల ప్రణాళికలో భాగముగా ఎన్యుమరేటర్స్ ద్వారా డి. ఆర్.డి.ఎ.వెలుగు సిబ్బంది ప్రతి కుటుంబముతో కూర్చుని వారి కుటుంబ అవసరాలను మరియు ఈ ఆర్ధిక సం.లో వారు ఏర్పాటు చేయబోయే జీవనోపాధి కార్యక్రమ వివరాలు తెలుసుకుని జిల్లాలో సుమారు 74,966 మంది స్వయం సహాయక సంఘ సభ్యులు రూ.876.41 కోట్లు రుణాలు కుటుంబ పెట్టుబడి ప్రణాళికలను తయారు చేయటం జరిగిందన్నారు. దీనిలో అగ్రికల్చర్ క్రింద 33,816 మంది సభ్యులు రూ.407.55 కోట్లు, పాడి పరిశ్రమ క్రింద 7,196 మంది రూ. 92.48 కోట్లు సేవారంగం 9460 మందికి రూ.116.29కోట్లు, ట్రేడింగ్ రంగం క్రింద 13,945మందికిరూ.181.22కోట్లు, హౌస్ కన్స్ట్రక్షన్ క్రింద 1,131మందికి రూ.11.01 కోట్లు తయారీ/ఉత్పత్తి రంగం క్రింద 921మందికి రూ.12.43కోట్లు, మత్స్య, పండ్ల తోటల కొరకు 437 మందికి రూ.5.28 కోట్లు మిగిలిన చిన్న చిన్న అవసరాలు అయిన పిల్లల చదువులు, ఇతర ఇంటి అవసరాల కొరకు రూ.50.15 కోట్లతో రుణ ప్రణాళిక తయారు చేయడం జరిగిందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్ కుమార్ రెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం కృష్ణ కుమార్ ప్రభు, యూనియన్ బ్యాంక్ డీజీఎం జవహర్, లీడ్ బ్యాంకు మేనేజరు ఎం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్ సిస్టం ద్వారా ఎక్కడా ఎటువంటి బోగస్ గ్రూపులకు తావు లేకుండా రుణాలను అందించవచ్చన్నారు. ఇందులో కీలకముగా ఋణం తీసుకునే ప్రతి సభ్యురాలు వారి ఆదార్ బయోమెట్రిక్ అథంటికేషన్ ద్వారానే ఋణం పొందుతారు కనుక ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదన్నారు. అలాగే స్వయం సహాయక సంఘ మహిళలు తీసుకునే రుణాలను పెద్ద మొత్తములో జీవనోపాధుల ఏర్పాటుకు వినియోగించుకోవాలని మరియు తీసుకున్న రుణాలను నూటికి నూరు శాతం తిరిగి చెల్లించేలా ఏపీఎంలు, సీసీలు పర్యవేక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు విజయవంతంగా అమలు జరిగేలా బ్యాంకర్లు తరుపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు జిల్లా ముందుఉండేలా బ్యాంకర్లు పూర్తి సహకారం అందిస్తామన్నారు.
వర్క్ షాపు లో సీబీఎం ఫైనాన్స్ మరియు బ్యాంకు లింకేజీ డీపీఎం యం కేశవ ఎస్ హెచ్ జీ బ్యాంక్ లింకేజ్ పోర్ట్‌ఫోలియోను సమర్థవంతంగా నడపడం, ఎస్ హెచ్ జీ సేవింగ్స్ మరియు రుణాలను ఉత్పాదక జీవనోపాధి కార్యకలాపాలు స్థాపించేందుకు వినియోగించడం, ఎస్ హెచ్ జీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి, ఎంట్రప్రెన్యూర్స్‌గా ఎదగడానికి సహాయం చేయడం లక్ష్యాలను సమర్దవంతముగా పూర్తి చేయుటకు ఈ ఆర్ధిక సం.లో అవలంభించాల్సిన ప్రణాళికలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బ్యాంకు మేనేజర్లకు మరియు వెలుగు సిబ్బందికి తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఎస్ హెచ్ జీ మహిళలు జూట్ బ్యాగ్ లు తయారు చేస్తున్న సుప్రియ, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో ఆహార పదార్ధాలు తయారు చేస్తున్న మసునూరి నాగమల్లేశ్వరిని, జీవనోపాదులపై డాక్టరేట్ చేసిన డీపీఎం అశోక్ ను సన్మానించారు.
సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజరు మహిపాల్ రెడ్డి , డీఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మీ, డీపీఎం కేశవులు, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, రీజనల్ మేనేజర్లు, మేనేజర్లు, ఏపీఎంలు, సీసీ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News