Breaking News

బీసీల‌కు ప‌దే ప‌దే అన్యాయం… : డాక్ట‌ర్ జె.పూర్ణ‌చంద్ర‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీలకు అన్ని రంగాల్లోనూ తీరని అన్యాయం జరుగుతోందని, పదే పదే ఇలాగే జరుగుతున్నా పాలకవర్గాలు మాత్రం ఈ విషయాన్ని కావాలనే పట్టించుకోవడం లేదని ఆలిండియా బహుజన సమాజ్‌ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్‌ జె.పూర్ణచంద్రరావు మండిపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఏపీ బీసీ పెన్షనర్స్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగుల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘‘బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం ఎందుకు జరుగుతోందంటే.. తాజాగా జరిగిన కులగణన చూసుకుందాం. అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలుంటే వారిలో 40 మందే బీసీలు. రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం అని లెక్కలు చెబుతున్నాయి. ఆ లెక్కన అసెంబ్లీలో మొత్తం 91 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలి. అలాగే, అగ్రవర్ణాల్లో కూడా మళ్లీ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. దానికి అగ్రవర్ణ పేదలు అనే ఒక ముసుగు తొడుగుతున్నారు. డీఎస్సీలో సాధారణంగా మెరిట్‌ లిస్టు ఇస్తారు. ఆ తర్వాత సెలక్షన్‌ లిస్టు ఇస్తారు, దాని ప్రకారం కాల్‌ లిస్టు పంపితే ఎవరికి ఉద్యోగం వచ్చింది, ఎవరికి రాలేదన్న విషయం తెలుస్తుంది. నేను పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించాను. ఎవరికి ఎందుకు ఉద్యోగం వచ్చిందో కూడా అప్పట్లో నేను వెబ్‌సైట్‌లో పెట్టాను. పెట్టడమే కాదు, నేనొక ఛాలెంజ్‌ ఆప్షన్‌ ఇచ్చాను. ఒక అభ్యర్థి ఎవరైనా తనకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చినట్లు గుర్తిస్తే వాళ్లు సవాలు చేయొచ్చు. దానిద్వారా వాళ్లకు సమాధానాలు కూడా పంపాను. కానీ ఇప్పుడు ఇక్కడ వ్యవస్థలో మాత్రం తప్పులు చేయడం అలవాటుగా మారిపోయింది. గత ప్రభుత్వంలో డిప్యూటీ డీఈఓలు 13 మంది ఎంపికైతే వారంతా ఒకే కులానికి, అంటే పాలక కులానికి చెందినవారు. ఇది ఎంత అన్యాయమో చెప్పండి. ఈ విషయం మనకు అర్థం కావాలి. గతంలో పీవీ నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడు ముల్కీ నిబంధన వచ్చింది. తెలంగాణ వాళ్లకు తెలంగాణలో ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. పీవీ నరసింహారావు ఆ తీర్పును స్వాగతించారు. దాంతో పెద్ద ఎత్తున గొడవలయ్యాయి. జై ఆంధ్ర ఉద్యమం వచ్చి, చివరకు పీవీ నరసింహారావును గద్దె దించేవరకూ ఊరుకోలేదు. అందుకే బీసీల్లో అవగాహన రావాలి. ఇలాంటి సమస్యలు మనకు ఎందుకు వస్తున్నాయి, బీసీలు ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నారు అనేది తెలుసుకోవాలి. అప్పుడు ఉద్యమించాలి’’ అని పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు.
ఏఐబీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త బక్కా పరంజ్యోతి మాట్లాడుతూ, ‘‘పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ మన 11 డిమాండ్ల సాధనకు కృషిచేయాలి. మనం ఎవరితో కలిసి ముందుకెళ్తే రాజ్యాధికారం వస్తుందో మీరందరూ ఆలోచించండి. రంగనాయకులు, వారి బృందానికి ఆలిండియా బహుజన సమాజ్‌ పార్టీ తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తాం’’ అని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *