-విద్యార్థుల్లో సృజనాత్మక పెంచే అంశాలపై అభిరుచి పెంచండి…
-సబ్ కలెక్టర్ జి. ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అంశాలపై కూడా అభిరుచి కలిగించాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణచంద్ అన్నారు. బుధవారం పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి నాడు-నేడు అభివృద్ధి పనులను పరిశీలించారు. మధ్యాహ్నం భోజన పథకం తీరును పరిశీలించారు. పిల్లలతో పాటు తాను మధ్యాహ్నాం భోజనం స్వీకరించి ఆహార నాణ్యత, రుచిని పరిశీలించారు. మరింత మెరుగైన విధంగా వుండేందుకు అవసరమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సంగీత, వివిధ సాంస్కృతిక అంశాలపై శిక్షణ ఇవ్వలన్నారు. ఇందుకోసం పాఠశాలలో కల్చరల్ రూమ్ ఏర్పాటు చేయాలని సంగీత శిక్షకులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటన్నాన్నారు. కీబోర్డు తదితర సంగీత సామాగ్రిని పాఠశాలకు అందజేస్తానని చెప్పారు. అదేవిధంగా పాఠశాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాలు ఏర్పాటు కోసం రూ. 5 లక్షలు అందిస్తానని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. బట్టి పట్టే విధానానికి దూరంగా వుండాలన్నారు. ఏమి చదువు కుందమనుకుంటున్నారు… ఎటువంటి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారన్నా విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో నాడు-నేడు కింద చేసిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి మరిన్ని సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం పాఠశాలలో మొక్కను నాటారు. వీరి వెంట డిప్యూటీ డిఇఓ ఎల్. చంద్రకళ, యంపిడివో జె. విమ తదితరులు ఉ న్నారు.