-ఒకే వేదికపై కళాత్మక హస్తకళా ఉత్పత్తులు
-సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం
– రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన సంస్కృతీ సాంప్రదాయలను పరిరక్షించుకునేలా ప్రతి ఒక్కరూ హస్తకళలను కొనుగోలుచేసి ప్రోత్సహించాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఆదివారం విజయవాడ పటమటలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ హస్తకళల సంస్థ ఆధ్వర్యంలో ఎపిట్కో (APITCO) నిర్వహణలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప బజార్ ను చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు… ఈ సందర్భంగా చైర్మన్ హరిప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు గాంధీ శిల్ప బజారులో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు చేతితో తయారు చేసిన కళాకృతులు గొప్ప అనుభూతిని కలుగజేస్తాయని తెలిపారు. దేశంలోని 13 రాష్ట్రాల నుంచి 35 రకాల వస్తువులను దాదాపు 100 స్టాల్స్ లో ఏర్పాటు చేసారు. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల పిలుపు మేరకు హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులను ప్రోత్సహించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఆయా స్టాల్స్ లో హస్తకళాకారులు వినూత్నంగా తయారు చేసిన వస్తువులు గాంధీ శిల్ప బజారులో అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వివిధ రకాల హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులను నగర వాసులు కొనుగోలు చేయాలన్నారు.
కళలను కాపాడుకోవాల్సిన అవసరంతోపాటు మన సంస్కృతీ సాంప్రదాయలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. హస్తకళాభిమానులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతోపాటు కళాకారులకు ఆర్థిక చేయూతను అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశంలోనే పలు ప్రాంతాల్లో గాంధీ శిల్ప బజార్ల ద్వారా ఒకే వేదికపై తీసుకొచ్చి ప్రదర్శన, అమ్మకాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నగర వాసులు అందరూ దీనిని ఆదరించాలని తెలిపారు. దేశంలోనే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రానికి చెందిన ఏటికొప్పాక, పోచంపల్లి, వెంకటగిరి ప్రాంతాల్లో హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులను ఈ స్టాల్స్ లో ఏర్పాటు చేసారన్నారు. కొనుగోలుదారులకు తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. గాందీ శిల్ప బజారు ను ఏర్పాటు చేసిన కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, ఎపిట్కో (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్) సంస్థలను చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఈసందర్భంగా అభినందించారు.
కార్యక్రమంలో ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ. శేఖర్, హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్. అపర్ణ లక్ష్మి, ఎపిట్కో సంస్థ ప్రతినిధులు ఎస్. గోపాలరావు, డి. సుధీర్ కుమార్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News