-ప్రతి విద్యార్థి జీవిత లక్ష్యాన్ని నిర్థేశించుకోవాలి..
-ప్రతిబంధకాలను అధిగమించినప్పుడే అశించిన స్ధాయికి ఎదుగుతాం..
-ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఉన్నత శిఖరానికి చేరండి..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ విద్యార్థులు ఆత్మనూన్యత భావాన్ని విడనాడి, జీవిత లక్ష్యాన్ని నిర్థేశించుకుని, ప్రతిబంధకాలను అధిగమించి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఉత్తమ విద్యను అభ్యశించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు.
సంక్షేమ వసతి గృహాల నిర్వహణ పరిశీలించేందుకు శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గుణదల గంగిరెద్దుల దిబ్బలో గల సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థినీ, విద్యార్థులతో కలసి అల్పాహారం చేశారు. తొలిత జిల్లా కలెక్టర్ గంగిరెద్దుల దిబ్బలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాన్ని తనిఖి చేశారు. 128 మంది ఇంటర్, పీజి విద్యార్థులకు గాను 114 మంది విద్యార్థులు హాజరయ్యారు. మెను ప్రకారం పెసరపప్పుపొంగలి, పుట్నాల చెట్నీ, కోడిగుడ్డు, మిల్లెట్ చిక్కీ, విద్యార్థులకు అందించే తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో వసతి పొంది విద్యనభ్యశించే విద్యార్థులు ఆత్మనూన్యత భావాన్ని విడనాడాలన్నారు. పేద విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టి అధునాతన మౌలిక వసతులు. పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చిన్నతనంలో తాను కూడా హాస్టల్‌లో ఉంటూ విద్యను అభ్యశించి ఈ స్థాయికి ఎదిగిన వాడినేనన్నారు.. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఎదురయ్యే ప్రతిబంధకాలను అధిగమించాలని అప్పుడే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతామన్నారు. ఎంతో మంది మహానుభావాలు వసతి గృహాలలో ఉండి చదువుకుని అత్యంత ప్రతిభావంతులయ్యారని వారిని ఆదర్శంగా తీసుకుని కష్టాన్ని ఇష్టంగా చేసుకుని శ్రమించాలని సూచించారు. విద్యార్థులకు స్టార్టప్, స్కిల్ డవలప్‌మెంట్ గురించి వివరించి వినూత్నంగా ఆలోచించేలా చర్యలు తీసుకోవాలని, ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ హబ్‌ను విద్యార్థులకు సందర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ సంక్షేమ అధికారి విద్యార్థుల భవిష్యత్ పట్ల ప్రత్యేక శ్రద్ద కనపరచాలన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్చిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను ఎప్పటికప్పుడు చైతన్యంతులను చేసి పట్టుదలతో మంచి విద్యను అభ్యశించేందుకు కృషి చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించి వారానికి ఒక రోజు హాస్టల్స్‌ను సందర్శించి నిర్వహణలో లోపాలను గుర్తిస్తే సరిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, కాచి చలార్చిన నీటీని వినియోగించాలన్నారు. హస్టల్స్‌కు సరఫరా చేసే మినరల్ వాటర్ ప్లాంట్లను వాటర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. వసతి గృహ నిర్వహణలో పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యానికి అత్యంత ప్రాదాన్యతనిచ్చి నిర్వహించినప్పుడు విద్యార్థులలో మానసిక ఉల్లాసం పెరిగి ఆరోగ్యంతో పాటు మెరుగైన విద్యను అభ్యశించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. వసతి గృహాలలో కిచెన్ షెడ్ల నిర్వహణను నిశితంగా పరిశీలించాలన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాంలో లివింగ్ రూమ్, డైనింగ్ కిచెన్ షెడ్ నిర్వహణకు సరిపోవడం లేదని, సాంఫీుక సంక్షేమ బాలికల హాస్టల్ కంపౌండ్ వాల్ పై ఇనుప కంచెను ఏర్పాటు చేయాలని ఆయా వసతి గృహాల సంక్షేమ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అవసరమైన చర్యలు చేపట్టేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
సంక్షేమ వసతి గృహ తనిఖీలలో వెనకబడిన తరగతుల వసతి గృహా సంక్షేమ అధికారిణి ఎ. విజయదుర్గ, సిబ్బంది ఎం. రాజశేఖర్, రెహమాన్, పి. రాజశేఖర్, సాంఘిక సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారిణి ఎ.వనజా రమణి, సిబ్బంది ఎం.సమాదానం, విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.
Prajavartha Online Telugu News