-ప్రజల ప్రాణరక్షణే ప్రాధాన్యం
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో తుపాన్ సంసిద్ధత పై చర్యలను స్వయంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం గంట్యాడ, ఎస్ కోట, ఎల్ కోట, జామి మండలాలలో సుడిగాలి పర్యటన జరిపి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ముందుగా గంట్యాడ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, విధుల కేటాయింపులో లోపాలను గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది విధులను సక్రమంగా కేటాయించాలని, వచ్చిన ఫిర్యాదులు నమోదు చేయడానికి ఒకరు, చేపట్టిన చర్యలు తెలియజేయడానికి ఒకరు చొప్పున ఇద్దరు సిబ్బందిని కేటాయించాలని, వారికి కేటాయించిన సమయంలో వారే విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సంబంధిత అధికారులను వెంటనే పరిస్థితిని చక్కదిద్ది నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎల్.కోట మండల తహసీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి తగు సూచనలు జారీ చేసారు.
ఎస్ కోట, జామి మండల తహసీల్దార్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రాధాన్యంగా భావించాలని స్పష్టం చేశారు. అత్యధిక వర్షపాతం మరియు గాలులు వీచే పరిస్థితుల నేపథ్యంలో వల్నరబుల్ గ్రామాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు, సమాచార సేకరణ మరియు సమన్వయం వంటి అంశాలపై సూచనలు జారీ చేశారు. ప్రతి కంట్రోల్ రూమ్ 24 గంటలు యాక్టివ్‌గా ఉండాలని, నిర్లక్ష్యం సహించబోనని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News