విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు, టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధాన నగర ప్రణాళికాధికారి కె.సంజయ్ రత్నకుమార్ విభాగాధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు.
సమావేశంలో బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ అమలు పురోగతి, పీజీఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం, డిస్‌ప్లే పరికరాల ఫీజు జీవో అమలు, టీడీఆర్ ఫైళ్ల పరిశీలన, ఆర్‌డీపీలు సిద్ధం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. భవనాల క్రమబద్ధీకరణ (BPS), లేఅవుట్ క్రమబద్ధీకరణ (LRS) పథకాలపై పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే ఫిర్యాదులను ఆలస్యం లేకుండా నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు.
పట్టణంలో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, వాటిని మొదటి దశలోనే గుర్తించి అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదేవిధంగా, టీడీఆర్ (Transferable Development Rights) సంబంధిత ఫైళ్లను వేగంగా పూర్తి చేయాలని, రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్స్ (RDP)ను నిర్ణీత గడువులో సిద్ధం చేయాలని సూచించారు.
ఉదయం జరిగే ఫీల్డ్ తనిఖీలు పట్టణ నియంత్రణలో అత్యంత ముఖ్యమని, ఎన్‌ఫోర్స్‌మెంట్ బలోపేతానికి ఇవి తప్పనిసరిగా కొనసాగాలని అధికారులకు తెలిపారు.
సమావేశం ముగింపులో, జారీ చేసిన ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని ప్రధాన నగర ప్రణాళికాధికారి స్పష్టం చేశారు. పట్టణ ప్రణాళికా నిబంధనలను కఠినంగా అమలు చేయడం ద్వారా పౌరులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు మోహన్ బాబు, రాంబాబు, పట్టణ ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News