– లోక్సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
లోక్సభలో ఈరోజు జరిగిన ‘సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు2025పై జరిగిన చర్చలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు ఉత్పత్తులపై పన్నులు విధించడాన్ని సమర్థిస్తూనే, చట్టం అమలులో ఉన్న సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై ఎంపీ గురుమూర్తి లేవనెత్తిన కీలక ప్రశ్నలు పరిశీలించినట్లయితే –
సిగరెట్ల పొడవులో మోసాలు: సిగరెట్ల పొడవును బట్టి పన్నులు మారుతుంటాయి. అయితే, కొన్ని కంపెనీలు సిగరెట్ల పొడవును తక్కువగా చూపి (తప్పుడు డిక్లరేషన్ ద్వారా) పన్ను ఎగ్గొట్టే ప్రమాదం ఉందని, దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఎంపీ ప్రశ్నించారు.
యంత్రాలా? మనుషులా?: యంత్రాలతో తయారు చేసే బీడీలను, చేతితో చేసినవిగా చూపి పన్ను రాయితీలు పొందే వారిని ఎలా గుర్తిస్తారని, అటువంటి మోసాలను ఎలా అడ్డుకుంటారని ఆయన ప్రభుత్వాన్ని అడిగారు.
సరిహద్దుల అక్రమ రవాణా: తక్కువ పన్ను ఉన్న పొగాకు రకాలను, ఎక్కువ పన్ను ఉన్న చూయింగ్ టొబాకో’గా మార్చి ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి తరలించే అక్రమాలను ఎలా అరికడతారని ఎంపీ ప్రశ్నించారు.
నికోటిన్ ఉత్పత్తులు: మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఓరల్ మరియు ట్రాన్స్డెర్మల్ నికోటిన్ ఉత్పత్తులకు సంబంధించిన పన్ను రేట్లను ఎప్పుడు ఖరారు చేస్తారని అడిగారు.
ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుతూనే, ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసే పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు ఈ బిల్లు దోహదపడుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో తుఫాను వల్ల నష్టపోయిన ఏపీ రైతాంగానికి అండగా నిలవాలని, నష్టపరిహారం మరియు పంటల బీమాను వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News