-ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మెరిట్ సీట్లు లేకుండా చేసింది గత పాలకులే?
-గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది
-ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పై 18 నెలల కాలంలో దాదాపు రూ. 50 వేల కోట్లు ఖర్చు
-ఒక్కో ఇటుక పేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెడుతున్నాం
-అర్హులైన అందరికీ అక్రడిటేషన్ అందిస్తాం
-సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు..
స్థానిక ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంగళవారం సమచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాల గురించి మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పీపీపీ (Public Private Partnership) అనేది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టింది కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న విధానంగా మంత్రి అన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్‌ను విమర్శించడం సరికాదు. గత ప్రభుత్వం 17 కాలేజీలు తెచ్చామని గొప్పలు చెప్పుకుందని కానీ, కేవలం దాదాపు రూ. 600 కోట్లు ఖర్చు చేసి 8,500 కోట్ల ప్రాజెక్టును గాలికి వదిలేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన పీపీపీ విధానం వల్ల 50% సీట్లు మెరిట్ ప్రాతిపదికన కేవలం రూ. 15,500 ఫీజుతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కుతాయన్నారు. గత ప్రభుత్వ విధానం వల్ల కేవలం 35% సీట్లు మాత్రమే మన విద్యార్థులకు అందేవని, ఈ మార్పు వల్ల కలిగే ప్రయోజనాన్ని విపక్షం జీర్ణించుకోలేకపోతుందన్నారు. పీపీపీ టెండర్లలో పాల్గొంటే జైలుకు పంపిస్తామనే విపక్షం బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరుతున్నారన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాబిన్నం చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే 32% అదనంగా అప్పులు చేసిందని స్వయంగా కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొందన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్‌కు వెలుపల, కార్పొరేషన్ల పేరుతో విచక్షణారహితంగా అప్పులు చేసిందని అన్నారు.. అప్పు తెచ్చిన నిధులను మూలధన వ్యయం (Capital Expenditure) కోసం కాకుండా కేవలం ఇతర ఖర్చులకే వినియోగించారని తెలిపారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏ నాగరికత అభివృద్ధి అయినా రోడ్లపై కనిపిస్తుందని అంటారని, కానీ గత ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులను, కొత్త రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు.
డ్రైనేజీ కాలువలు, కాలువల నిర్వహణ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, దీనివల్ల వ్యవసాయ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ప్రాజెక్టులను గత ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిందన్నారు. చింతలపూడి ప్రాజెక్టు 7-8 వేల కోట్లతో పూర్తి అయ్యే అవకాశం ఉన్నా అప్పటికే 4 వేల కోట్లు ఖర్చు చేసినా, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారనే కారణంతో నిలిపివేశారన్నారు. దీనివల్ల 2.5 లక్షల ఎకరాల సాగు నీరు, లక్షల మందికి తాగు నీరు అందకుండా పోయిందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 18 నెలల కాలంలో దాదాపు 50 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఇంట్లో ఒక్కరికే చదువుకునే ఆడ పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తే, కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఆడ పిల్లలు ఉంటే అంతమందికీ “తల్లికి వందనం” పథకాన్ని వర్తింపజేస్తోందన్నారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 8.29 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని, పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో మరో 13.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎంవోయూ లపై సంతకాలు జరిగాయని, వీటి ద్వారా దాదాపు 20 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేశామన్నారు. నైపుణ్యాభివృద్ధి కేవలం చదువుకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతకు స్కిల్ (నైపుణ్యం) నేర్పించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రభుత్వం 25 బెస్ట్ పాలసీలను (స్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటి, డ్రోన్, ఇండస్ట్రియల్ పాలసీలు) ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా, పరిశ్రమలు పెట్టే పెట్టుబడిదారులకు ఇన్సెంటివ్స్ అందించడానికి ‘ఎస్క్రో అకౌంట్’ (Escrow Account) విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. పొరుగు రాష్ట్రాల మంత్రులు కూడా ఏపీకి వస్తున్న పెట్టుబడుల గురించి చర్చించే స్థాయికి రాష్ట్రం చేరుకుందంటే దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, పరిపాలనా దక్షత కారణంగా పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా ఫోన్ ద్వారానే 700-800 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance) ద్వారా పొందే సదుపాయం కల్పించామన్నారు. విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో విద్వేషాలు, ఉద్వేగాలు రెచ్చగొడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ ఒక దేవాలయం వంటిదని, అక్కడ ప్రభుత్వం ప్రజలకు సమాధానాలు చెప్పాలి, ప్రతిపక్షం ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పేర్కొన్నారు. కేవలం ప్రతిపక్ష హోదా రాలేదనే నెపంతో అసెంబ్లీకి రాకుండా ఉండటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.
జల్ జీవన్ మిషన్, అమృత్ వంటి కేంద్ర పథకాల ద్వారా ఇతర రాష్ట్రాలు లక్షల కోట్లు పొందుతుంటే, గత ప్రభుత్వం కనీసం రూ. 3 వేల కోట్లు కూడా తీసుకురాలేకపోయిందని, దీనివల్ల రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత ప్రభుత్వం సోలార్ కంపెనీలతో ఉన్న ఒప్పందాలను రద్దు చేయడం వల్ల రాష్ట్రంపై రూ. 9,000 కోట్ల భారం రాష్ట్రంపై పడిందన్నారు. తక్కువ ధరకు వచ్చే సోలార్ విద్యుత్‌ను కాదని, ఓపెన్ మార్కెట్‌లో రూ. 10 నుండి రూ. 14 వరకు విద్యుత్ కొనడం వల్ల ప్రజలపై భారం పడిందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయే ఐదేళ్లలో యూనిట్ విద్యుత్ ధరను రూ.1.20 పైసలు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వం వచ్చే సమయానికి యూనిట్ ధర రూ. 5.19 పైసలు ఉండగా, ప్రస్తుతానికి అది రూ.4.80 – రూ.4.90 మధ్య ఉందని, దీనిని రూ. 4 కన్నా తక్కువకు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. గతంలో విద్యుత్ ఉత్పత్తి పెద్ద సంస్థలకే పరిమితం కాగా, ఇప్పుడు ప్రతి పేదవాడు పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఇందులో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఓసీ ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బీసీలకు సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్స్ ఏర్పాటు కోసం 20% సబ్సిడీ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయాన్ని (Per capita income) రూ. 50 లక్షల మించి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. జిడిపి (GDP) పెరుగుదలను ప్రతి సంవత్సరం మానిటర్ చేస్తూ, ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు.
క్వాంటం కంప్యూటర్:
ప్రపంచంలోనే అతికొద్ది దేశాలకే అందుబాటులో ఉన్న క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతను రాష్ట్రం ద్వారా దేశానికి అందించబోతున్నామన్నారు. దీనికి కావలసిన కాంపోనెంట్స్ తయారీ కూడా మన రాష్ట్రంలోనే జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
రహదారుల అభివృద్ధి
గతంలో రోడ్డ దుస్థితి ఏవిథంగా ఉండేదో మనందరికీ తెలిసిన విషయమేనని, గుంతల రోడ్లను (Potholes) బాగు చేయడానికి, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు.
నీటి వనరులు మరియు ఇతర పథకాలు:
గ్రౌండ్ వాటర్ పెంచడం, నదుల అనుసంధానం ద్వారా రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగు నీటి సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు జల్ జీవన్ మిషన్, అమృత్ వంటి వాటిని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రానికి మేలు చేస్తామన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖలైన అటవీ, పంచాయతీ రాజ్ వంటి వాటిలో నిబద్ధతతో పని చేస్తున్నారని, పంచాయతీలకు వచ్చే నిధులు పారదర్శకంగా ఖర్చు అయ్యేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై ఒక పారిశ్రామికవేత్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కు తక్షణమే స్పందించి, వారిని రాష్ట్రానికి ఆహ్వానించిన తీరు మంత్రి లోకేష్ పనివేగానికి నిదర్శనమన్నారు.
పెట్టుబడుల ఆకర్షణ:
అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించి, అక్కడి దిగ్గజ సంస్థలకు రాష్ట్ర విధానాలు, మానవ వనరులు, సహజ వనరుల పట్ల నమ్మకాన్ని కలిగించారని మంత్రి అన్నారు.
ప్రముఖ సంస్థల రాక వెనుక మంత్రి లోకేష్ కృషి:
గూగుల్, రిలయన్స్, కాగ్నిజెంట్ వంటి ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రానికి రావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కలయికతో రాష్ట్రంలో అత్యంత బలమైన రాజకీయ శక్తి ఏర్పడిందని పెట్టుబడిదారులలో నమ్మకం కలిగించారన్నారు. తల్లీ వందనం, ఉచిత బస్సు సౌకర్యం, స్త్రీ శక్తి వంటి పథకాల ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. సామాజికాభివృద్ధి: ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ కుటుంబాల్లోని పిల్లలకు సాఫ్ట్ వేర్ లేదా ఐటీ రంగాల్లో మంచి ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారి సామాజిక గౌరవాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారన్నారు.
రైతు సంక్షేమం: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పొగాకు, కోకో, మామిడి వంటి పంటలకు ప్రభుత్వం అదనపు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోందన్నారు.
వేగవంతమైన చెల్లింపులు: ధాన్యం కొనుగోలు చేసిన 24 నుండి 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం అని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం అమలు తీరు, ఎదురవుతున్న సవాళ్లు మరియు భవిష్యత్ ప్రణాళికలపై మంత్రి వివరిస్తూ…
గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలను శ్మశానాలు, కొండ వాలు ప్రాంతాలు, నదులు, కాలువల సమీపంలో కేటాయించడం వల్ల ప్రజలు అక్కడ నివసించడానికి ఇష్టపడటం లేదన్నారు. అనేక కాలనీలలో కనీస సౌకర్యాలు కల్పించకుండానే ఇళ్లను ప్రారంభించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. 2014-2019 మధ్య కాలంలో దాదాపు 5 నుండి 6 లక్షల కుటుంబాలకు మంజూరైన గృహాలను గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో రద్దు చేసి పేదలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇప్పటివరకు 18.5 లక్షల ఇళ్లు మంజూరు కాగా, గత ప్రభుత్వం కేవలం 6.5 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 3.2 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిందన్నారు.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 5.5 లక్షల ఇళ్లను 2026 జూన్-జూలై నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. పట్టణ ప్రాంతాల్లో 41,000 ఇళ్లు మంజూరు చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన 10 లక్షల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు గృహాలను మంజూరు చేస్తామన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి అన్నారు.
టిడ్కో(TIDCO)గృహాలకు అదనపు సాయం:
కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీ, మైనారిటీలకు రూ. 50,000, ఎస్టీలకు రూ. 75,000 మరియు పీజీటీడీఎస్ (PGTDS) వర్గాలకు రూ. 1 లక్ష వరకు అదనపు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. గృహ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నుండి 40% నిధులను కేటాయించాలని నిర్ణయించారన్నారు. గత ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారుల పేరుతో బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల లబ్ధిదారులు సిబిల్ (CIBIL) స్కోర్ తగ్గి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించి వచ్చే ఏడాది జూన్ నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
మీడియా అక్రిడిటేషన్ పై ప్రభుత్వం నిర్ణయాలు:
ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో జర్నలిస్టుల, మీడియా సంస్థల బాధ్యత చాలా కీలకమని ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. గత ప్రభుత్వ కాలంలో (2019-2024) అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య 22,000 నుండి 12,000కు తగ్గించారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. సోషల్ మీడియా, యూట్యూబర్లకు కూడా అక్రిడిటేషన్ ఇచ్చే అంశంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేశారన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పాలసీలను పరిశీలించి అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశించారన్నారు. అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం పొంది, ఇప్పటికే జీవో విడుదలయింది.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. 2014-2019 మధ్య కాలంలో భూ కేటాయింపులకు సంబంధించి కొన్ని జీవోలు ఇచ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారధి తెలియజేశారు.
కార్యక్రమంలో సీఆర్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, ఏపీయూడబ్లూజే, ఐజేయూ నాయకులు ఐవీ సుబ్బారావు, కంచల జయరాజు, సోమ సుందర్, చావా రవి, వెంకటేశ్వర్లు, దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, ఏచూరి శివ, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News