బద్వేల్ ఉప ఎన్నికపై పటిష్టమైన నిఘా…

-జిల్లా, నియోజక వర్గం సరిహద్దులో చెక్ పోస్టుల ద్వారా నిశితమైన తనిఖీలు
-ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఎన్నికల వ్యయం పై నిరంతర పర్యవేక్షణ
-140 పైచిలుకు పోలింగ్ స్టేషన్లలో లైవ్ టెలీకాస్టు ద్వారా నిశిత పరిశీలన
-ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పటిష్టమైన నిఘా మధ్య బద్వేల్ ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్దంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బద్వేల్ ఉప ఎన్నిక నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ మాట్లాడుతూ బద్వేల్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికను ఈ నెల 30 న నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 28 న ఉప ఎన్నికల ప్రణాళికను జారీచేసిన నేపథ్యంలో ఆ రోజు నుండే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు గురువారం ఉదయం అమరావతి సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళిని వివరించడం జరిగిందన్నారు. అదే రోజు మద్యాహ్నం నుండి కడప జిల్లా బద్వేల్ శాసన సభా నియోజక వర్గం ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో వీడియో కాన్పరెన్సు నిర్వహించి వారిని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఎన్నికల వ్యయం పై నిరంతర పర్యవేక్షణకు తగు చర్యలు చేపట్టడమైందన్నారు. కడప జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీస్ పోస్టు, చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిశితంగా తనిఖీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘాకై ఎనిమిది టాస్కుఫోర్సు టీమ్లను, మండలానికి మూడు చొప్పున మొత్తం 21 ప్లైయింగ్ స్క్వాడ్లను, మూడు వీడియో వ్యూయింగ్ టీమ్లను, నాలుగు ఎన్నికల వ్యయ పర్యవేక్షణా టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్న మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 140 పైచిలుకు పోలింగ్ స్టేషన్లలో లైవ్ టెలీకాస్టు ద్వారా ఎన్నికను నిశిత పరిశీలనకు తగు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.

ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ప్రత్యేక మెకానిజమ్…
ఎన్నిక నియమావళి ఉల్లంఘనకు సంబందించి ఫిర్యాదుల స్వీకరణ, వారి తక్షణ పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్లను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 1950 కి పోన్ చేసిగాని లేదా www.nvsp.in అనే వెబ్సైట్ ద్వారా కాని పిర్యాధులను నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అదే విధంగా స్మార్టు ఫోన్లలో c-VIGIL అనే మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని, ఆ యాప్ ద్వారా కూడా లైవ్ ఫొటోలను, వీడియోలను తమకు పంపించవచ్చన్నారు. ఫిర్యాధు అందిన వెంటనే తక్షణమే స్పందించి తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఉప ఎన్నికల ప్రణాళిక…
ఈ ఉప ఎన్నికకు సంబందించి నామినేషన్ల దాఖలు అక్టోబరు 8 లోగా చేసుకోవాల్సి ఉందని, నామినేషన్ల పరిశీలనకు అక్టోబరు 11, ఉప సంహరణకు అక్టోబరు 13 చివరి తేదీలని ఆయన తెలిపారు. అక్టోబరు 30 న ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకూ ఈ ఉప ఎన్నిక జరుగుతుందని, ఓట్ల లెక్కింపు నవంబరు 2 న జరుగుతుందని, మొత్తం ఈ ఉప ఎన్నిక ప్రక్రియ నవంబరు 5 లోపు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు.

వికలాంగులకు, వృద్దులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం…
ఈ ఉప ఎన్నికకు సంబందించి 80 సంవత్సరాలు పైబడిన వృద్దులు, విభిన్న ప్రతిభావంతులు మరియు కోవిడ్ పాజివ్ ఓటర్లు కోరుకున్నట్లైతే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఇందుకు నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుండి ఐదు రోజుల్లోపు 12D ఫార్ములలో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు.

అక్టోబరు 8 లోపు ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకోవచ్చు…
ఈ ఏడాది జనవరి 15 నాటికి ప్రచురించబడ్డ తుది ఓటర్ల జాబితా ప్రకారం, తదుపరి సెప్టెంబరు 29 నాటికి నమోదు చేసుకున్న ఓటర్లను కూడా పరిగణలోకి తీసుకుని మొత్తం 2 లక్షల 16 వేల 154 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఈ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. అయితే అక్టోబరు 8 లోపు ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకున్న వారు కూడా ఈ ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు.

30 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించాం…
బద్వేల్ శాసన సభా నియోజక వర్గం పరిధిలో మొత్తం 281 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఆయన తెలిపారు. అందులో 272 పోలింగ్ స్టేషన్లతో పాటు ప్రతి 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున అదనంగా మరో తొమ్మిది ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వీటిలో 30 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని, వాటిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఉప ఎన్నికలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అభ్యర్థిని ఎంచుకున్న 48 గంటల్లోపే క్రిమినల్ యాంటిసిడెంట్స్…
సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఆయా పార్టీలు అభ్యర్థిని ఎంచుకున్న 48 గంటల్లోపే ప్రచురించాల్సి ఉంటుందుని ఆయన తెలిపారు.

నామినేషన్ సమయంలో ర్యాలీలు, ఉత్సవాలు నిషేదం…
కోవిడ్ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలను ఈ ఎన్నికల నిర్వహణలో తప్పక పాటించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు కేవలం మూడు వాహనాలు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, ఆ సమయంలో ఎటు వంటి ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించడం నిషేధమని ఆయన తెలిపారు . ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమాశాలకు సంబందించి స్టార్ క్యాంపైనర్లకు వేయి మందిని, ఇతరులకు 500 మంది, వీధులో సమావేశాలకు 50 మందిని, డోర్ టు డోర్ క్యాంపైన్ కు ఐదుగురిని, ఒక్కోక్క అభ్యర్థికి 20 వాహనాలను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే అనుమతించడం జరుగుతుందని ఆయన తెలిపారు . ఎటు వంటి రోడ్ షో లు నిర్వహించకూడదన్నారు. రెండు సార్లు కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజంట్లు గా నియమించుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

72 గంటలకు ముందే ఎన్నికల ప్రచారం నిలుపుదల…
పోలింగ్ ముగిసే సమయానికి 72 గంటల ముందుగానే ఎన్నికల ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 27 సాయంత్రం 7.00 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని అన్నిరాజకీయ పార్టీలు నిలిపివేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

వాలంటీర్ల ప్రమేయం ఉండదు…
ఈ ఉప ఎన్నికల నిర్వహణలో వార్డు, గ్రామ వాలంటీర్ల ప్రమేయం ఏ మాత్రము ఉండబోదని, వారిని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *