రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ వెల్ఫేర్ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ ఎస్. సత్యనారాయణ శనివారం రాజమహేంద్రవరం గణేష్ చౌక్ వద్ద ఉన్న కళాశాల బాలికల వసతి గృహాన్ని, రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థినులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పారిశుధ్యం, భద్రత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థినుల కోసం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వసతి గృహాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వసతి గృహంలో విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించి, నమోదైన సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులు హాజరవుతున్నారా లేదా అన్నదానిపై సమగ్రంగా తనిఖీ చేశారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, మెనూ ప్రకారం భోజనం అందుతున్న తీరును పరిశీలించి, వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. వసతి గృహ ప్రాంగణంలో శానిటేషన్ నిర్వహణ, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల శుభ్రత, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించేలా అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి నిర్లక్ష్యం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సత్యనారాయణ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి కుమారి బి. శశాంక, ఏబీసీడబ్ల్యూ ఓలు టి.వి. ప్రసాద్, ముత్యాల సుబ్బారావు, హెచ్‌డబ్ల్యూ ఓలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News