-ప్రపంచానికి తెలుగువారిచ్చిన విలువైన బహుమతి కొండపల్లి బొమ్మలు
-యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాచీన చరిత్ర, సహజసిద్ధమైన రంగులు, పర్యావరణహితమైన తయారీ విధానం అంతర్జాతీయ స్థాయిలో కొండపల్లి హస్తకళల పేరు ప్రఖ్యాతలకు ముఖ్య కారణమని యూరోపియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ తెలిపారు.
తెలుగువారి కళా వైభవానికి నిలువుటద్దం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి హస్తకళలను శుక్రవారం కొండపల్లిలోని ఏపీ టూరిజం శాఖ నిర్వహిస్తున్న కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ ను యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా తో కలిసి పరిశీలించారు. స్థానికుల సంక్రాంతి ముగ్గులతో సాంప్రదాయ స్వాగతంతో అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ పర్యటన ప్రారంభమైంది… సాంప్రదాయ హారతి, పూల దండలతో రాయబారిని తిలకందిద్ది స్వాగతించగా, వీధి మొత్తం సప్తవర్ణ ముగ్గులతో అలంకరించబడిన పండుగ వాతావరణంగా మారింది. ఈ ప్రాంతమంతా సంక్రాంతి ముందుగానే వచ్చిన స్ఫూర్తిని ప్రజల మనస్సుల్లో రేకెత్తించింది. దీనికితోడు సంక్రాంతి గొబ్బెమ్మల పాటలకు రాయబారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా లు స్థానిక మహిళలతో కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేయడం అందరినీ ఆకట్టుకుంది.
ఈయూ రాయబారి ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సందర్శించి అందులో బొమ్మల తయారీ విధానాన్ని, వాటి ధరలను కళాకారుల నుండి అడిగి తెలుసుకున్నారు. సాదాసీదా పొనికి కర్రతో కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకుని, అద్భుత శిల్పాలుగా మారే ప్రక్రియను చూసి ఆయన ముగ్ధులయ్యారు. కేవలం బొమ్మలను బొమ్మలగానే కాకుండా, ఆ బొమ్మల వెనుక ఉన్న శతాబ్దాల నాటి చరిత్రను, హస్తాకళాకారుల మనోభావాలను, వారి అంకితభావాన్ని అంబాసిడర్ కొనియాడారు. ప్రతి బొమ్మ ఒక కథ చెబుతోంది, ప్రతి రంగు ఒక సంస్కృతిని ప్రతిబింబిస్తోంది అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించటం ఆయనను ఈ పర్యటన ఎంత హత్తుకుందో చెప్పకనే చెపుతుంది. ఐరోపా దేశాలకు, భారతీయ గ్రామీణ కళలకు ముఖ్యంగా తెలుగువారి సాంస్కృతిక వైభవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం ఎంతో అద్భుతంగా ఉందనటానికి ఈ పర్యటన ఒక గొప్ప సాంస్కృతిక వారధిలా నిలుస్తుందని, హస్తకళాకారుల నైపుణ్యం ప్రపంచ స్థాయి ప్రశంసలకు అర్హమని ఆయన పేర్కొన్నారు. స్థానిక సభ్యులు రమణరావు, తదితరలు రాయబారికి కొండపల్లి బొమ్మలను బహుకరించారు.
కొండపల్లిలో అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ మాటల్లో…….
కొండపల్లి కళాకారుల వేళ్ల కొనల్లో అద్భుతమైన మ్యాజిక్ ఉంది. ఒక సామాన్యమైన చెక్క ముక్కను అపురూపమైన కళాఖండంగా మార్చడం నిజంగా అద్భుతం. ఈ వారసత్వాన్ని కాపాడుతున్న కళాకారులకు నా అభినందనలు. ఈ పర్యటనలో ఆయన కళాకారులతో ముచ్చటించి, బొమ్మల తయారీలోని మెళకువలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కొండపల్లి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఈ సందర్శన, స్థానిక కళాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత శక్తివంతమైన జీవన చేతిపనుల సంప్రదాయాలలో ఒకటైన కొండపల్లి హెరిటేజ్ స్ట్రీట్, ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను సందర్శించడంతో, కొండపల్లిలోని చారిత్రాత్మక వారసత్వ వీధి రంగులు, చేతిపనులు మరియు వేడుకలతో సజీవంగా మారింది.
ఆంధ్రా వంటకం భేష్ … ఈయూ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్
గుణదల పార్క్ హయత్ హోటల్ ల్లో ఈయూ రాయబారి ఆంధ్రా వంటకాలు సాంప్రదాయమైన అరటికాయ అరిటాకులో భోజనం చేశారు.. ఘాటైన ‘గుంటూరు గోంగూర పచ్చడి’, ‘నాటుకోడి పులుసు’ రుచికి ఆయన ఆశ్చర్యపోయారు. రాయలసీమ స్పెషల్ ‘ఉలవచారు’, నెల్లూరు ‘చేపల పులుసు’ అంబాసిడర్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. నోరూరించే ‘పూతరేకులు’, వేడి వేడి ‘బొబ్బట్లు, పులిహోరా’ తిన్న తర్వాత, “యూరప్ డెజర్ట్ లకు ఇవి ఏమాత్రం తీసిపోవు” అని అంబాసిడర్ ప్రశంసించారు. “ఆంధ్ర వంటకాల్లోని సుగంధ ద్రవ్యాలు, వాటి వెనుక ఉన్న సంప్రదాయం అద్భుతం. ఇక్కడి ప్రజల ఆత్మీయత ఆ వంటకాల్లో కనిపిస్తోందని అని అంబాసిడర్ పేర్కొన్నారు. స్టార్ హోటల్స్ అధ్యక్షులు రామిశెట్టి వీరాస్వామి కూడా రాయబారితో ఉన్నారు..
గుణదల పార్క్ హైయత్ హోటల్లో మధ్యాహ్న భోజనం అనంతరం మాట్లాడుతూ…
యూరోపియన్ దేశాల సాంకేతికత, పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుదీర్ఘ తీరప్రాంతాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు బ్లూ వ్యాలీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు ఈయూ రాయబారి హెర్వే డెల్ఫిన్ తెలిపారు. సముద్ర వనరుల స్థిరమైన వినియోగం, తీరప్రాంత అభివృద్ధి, సముద్ర ఆధారిత పరిశ్రమల వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించే వీలుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో సహకారంపై చర్చించామన్నారు. ఆవకాయ్- అమరావతి ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో కలిసి పాల్గొనడం ఒక గొప్ప అనుభూతిని కలిగించిందని.. ఆ కార్యక్రమంలో ప్రదర్శించిన సంగీత, నృత్య ప్రదర్శనలను ఆశ్వాదించానన్నారు. త్వరలో దిల్లీలో ఈయు- ఇండియా సమ్మిట్ జరగనుందన్నారు. ఈయూ సమాఖ్య నాయకలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ అంశాలపై చర్చించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేసే వీలుందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 6,000 ఐరోపా కంపెనీల సంఖ్య, పెట్టుబడులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ కంపెనీల ద్వారా సుమారు 3.8 మిలియన్ల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఐరోపాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, వారికి స్కాలర్షిప్లు, ఇతర నైపుణ్య శిక్షణలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 9 లక్షల మంది భారతీయులు ఐరోపాకు వీసాలు పొందారన్నారు. రానున్న రోజుల్లో విద్య, వ్యాపారం, సంస్కృతి మరియు పర్యాటక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఈయూ రాయబారి హెర్వే డెల్ఫిన్ ఆశాభావం వ్యక్తం చేశారు..
Prajavartha Online Telugu News