జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలనే సదుద్దేశంతో పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర్ బాబు ఐ.పి.ఎస్., నేతృత్వంలో అడ్మిన్ డి.సి.పి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. స్వీయ పర్యవేక్షణలో డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో 34 రోజులపాటు 510 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో బాగంగా 28వ రోజు ఈ సైకిల్ యాత్ర కార్యక్రమం జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిదిలో అత్యంత ఘనంగా ముగిసింది. ఈ రోజు డ్రగ్స్ పై దండయాత్ర 28 వ రోజు 15 కిలోమీటర్ల మేర సాగింది. ఇప్పటి వరకు ఈ యాత్ర 412 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధులుగా లక్ష్మీశా, ఐఏఎస్ NTR జిల్లా కలెక్టర్ S.V రాజశేఖర్ బాబు IPS, NTR పోలీస్ కమిషనర్ ఆర్.కే. రవికృష్ణ IPS, ఈగల్ ఐజీ, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), ఎమ్మెల్యే జగ్గయ్యపేట, బి.లక్ష్మీనారాయణ, IPS – రూరల్ డీసీపీ, కే.జి.వి. సరిత, IPS – అడ్మిన్ డీసీపీ , కే.నగేష్ బాబు SP – ఈగల్, బాలకృష్ణ – ఆర్డీఓ, నందిగామ హాజరై ప్రజలకు, యువతకు దిశా నిర్ధేశం చేశారు.
ప్రజల అపార ఆదరణతో, విద్యార్థుల ఉత్సాహంతో ముందుకు సాగిన ఈ మహాయాత్ర జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ లో ఎప్పుడూ చూడని విధంగా భారీ జనసమూహంతో మహాసభగా మారింది. ఈ కార్యక్రమం రూరల్ డి.సి.పి. బి లక్ష్మి నారాయణ ఐ.పి.ఎస్, నందిగామ ఇన్ ఛార్జ్ ఏ.సి.పి. లతాకుమారి పర్యవేక్షణలో జగ్గయ్యపేట ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, వారి సిబ్బందితో అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:40 గంటలకు జగ్గయ్యపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభమై, ఎన్టీఆర్ సర్కిల్ – సత్యనారాయణపురం వరకు విజయవంతంగా సాగింది. సాయంత్రం 4:10 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుండి 500 మంది విద్యార్థులతో డప్పు వాయిద్యాల మధ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. వేదికపై పాఠశాల విద్యార్థులు నృత్యాలు, డ్రగ్స్ పై అవగాహన నాటికలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,500 మంది విద్యార్థులు, యువత, మహిళలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.సభలో ముఖ్య అతిథులు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలు, దుష్ప్రభావాల గురించి వివరించారు.
మత్తు రహిత సమాజం లక్ష్యంగా సాగుతున్న ఈ సైకిల్ యాత్రలో హృదయాలను కదిలించిన ఓ భావోద్వేగ క్షణం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ పెద్దావిడ ధైర్యంగా ముందుకు వచ్చి, *“నా ప్రాణం పోయినా పర్వాలేదు… డ్రగ్స్ గురించి పోలీసులకు నేనే సమాచారం ఇస్తాను”అంటూ గట్టి గొంతుతో తన సంకల్పాన్ని వెల్లడించింది. ఆమె మాటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తు చేస్తూ యాత్రకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
డ్రగ్స్ అనే మత్తు ఎంతటి కుటుంబాలనైనా నిశ్శబ్దంగా నాశనం చేస్తుందో కూలి పనులు చేసుకుంటున్న మహిళలు ఈ యాత్రను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజల మద్దతు పెరుగుతోంది అంటే కారణం ఒక్కటే: ఇది కేవలం కార్యక్రమం కాదు, భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం. ఇది ఒక ర్యాలీ మాత్రమే కాదు. ఇది యువత భవిష్యత్తు కాపాడే సంకల్పం. ప్రజల ఆధారణాలతో ఈ దండయాత్ర మరింత శక్తిగా, మరింత వేగంగా ముందుకు దూసుకుపోతుంది.
ఈ సందర్భంగా అధికారులు డ్రగ్స్ పై ఎటువంటి సమాచారాన్ని అయిన 112 కు గాని 1972 కి గాని తెలియజేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ https://events.ntrpolice.in/ లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వాలని తెలియజేశారు.
Prajavartha Online Telugu News