విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాఖధిపతులు క్షేత్రస్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను శాఖాధిపతులు క్షేత్రస్థాయిలో వెళ్లి సమస్య ఏంటి అని పూర్తిగా అర్థం చేసుకొని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేటట్టుగా ఫిర్యాదుదారునికి ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తామో వివరించి, వారికి సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించాలని, సమస్య పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు.
గతవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నివేదికలో వచ్చిన ఫిర్యాదులకు అధికారులు అందించిన పరిష్కారాన్ని సమీక్షించారు. ముందుగా ఇంజనీరింగ్ విభాగంలో ఫిర్యాదును సమీక్షిస్తుండగా, రోడ్డుకు పేవర్ బ్లాక్స్ వెయ్యాలన్న ఫిర్యాదును ఇంకా ఎందుకు పరిష్కరించలేదని, అందుకు గల కారణాలు ఏంటని అడిగారు. ప్రజల సమస్యలకు అధికారులు స్వయంగా తామే క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర పరిష్కారం అందించాలని అన్నారు. తదుపరి ప్రజారోగ్య విభాగంలో మరో సమస్యను సమీక్షిస్తుండగా, వారు ఇచ్చిన నివేదిక సరిగ్గా లేకపోవడం గమనించి నివేదిక సమర్పించేటప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన నివేదిక సమర్పించాలని అన్నారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 25 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 10, ఇంజనీరింగ్ 7, రెవిన్యూ 3, పబ్లిక్ హెల్త్ 2, ఎస్టేట్ 2, హార్టికల్చర్ 1 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు ఏ. రవీంద్రరావు, డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, సూపర్డెంట్ ఇంజనీర్ (వర్క్స్) వి.చంద్రశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, ఆర్ ఎఫ్ ఓ మాల్యాద్రి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ కామేశ్వరరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News