నిడదవోలులో “దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

-పచ్చ జెండా ఊపి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేష్
-దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారితో కలిసి విందు భోజనం చేసిన మంత్రి దుర్గేష్
-నిడదవోలు నియోజకవర్గంలో 4,436 మంది దివ్యాంగులకు లబ్ధి కలుగుతుందని వెల్లడి
-సహాయకులకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నామని ప్రకటన
-దేశంలోనే దివ్యాంగులకు రూ. 6,000 పింఛను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని వెల్లడి
-రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా ప్రతిష్టాత్మకమైన “దివ్యాంగ శక్తి” ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని చేపట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని ‘ఐ లవ్ నిడదవోలు’ సెంటర్ వద్ద మంత్రి దుర్గేష్ పచ్చ జెండా ఊపి, రిబ్బన్ కట్ చేసి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా బస్సులోకి కూర్చొని దివ్యాంగులకు తొలి ‘జీరో టికెట్’ను అందజేశారు. అనంతరం వారితో కలిసి సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయం వరకు బస్సులో ప్రయాణించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యాంగులందరినీ ఆప్యాయంగా పలకరించి.. వారికి స్వయంగా భోజనం వడ్డించి.. వారితో కలిసి విందులో పాల్గొన్నారు.నిడదవోలు నియోజకవర్గంలోని రూరల్ లో 1464, అర్బన్ లో 538, పెరవలి మండలంలో 1213, ఉండ్రాజవరంలో 1221 మొత్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా 4,436 మంది దివ్యాంగులకు ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, ప్రస్తుతం 2 లక్షల మంది ఆర్టీసీలో దివ్యాంగులు పాస్ లు వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసినట్లుగానే దివ్యాంగులకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు స్వతంత్రంగా ప్రయాణిస్తూ, తమ రోజువారీ కార్యకలాపాలను మరింత సులభంగా నిర్వహించుకోగలుగుతారని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏపీడబ్ల్యూడీ చట్టం 2016 ప్రకారం గుర్తింపు పొందిన 21 రకాల దివ్యాంగుల్లో 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఇది కేవలం 50 శాతం మాత్రమే ఉండేదని గుర్తుచేశారు. అదే విధంగా ఏసీ డీలక్స్, నాన్-స్టాప్, సప్తగిరి మరియు అంతర్రాష్ట్ర సర్వీసుల్లో 50 శాతం రాయితీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చేవారికి కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నామని వెల్లడించారు.”దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు. వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఇప్పటికే టూ వీలర్లు అందించాం. తీవ్ర ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారికి రూ. 10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేల పింఛను అందిస్తున్నాం. మహిళల కోసం ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఇప్పటికే 52 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి, ఇప్పుడు ‘దివ్యాంగ శక్తి’ ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఆర్టీసీకి ఏటా రూ. 207 కోట్లు చెల్లిస్తోంది” అని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. నిడదవోలులో దివ్యాంగుల కోసం ప్రత్యేక భవన నిర్మాణానికి మున్సిపల్ కౌన్సిల్ ద్వారా స్థలం కేటాయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. అలాగే దివ్యాంగులకు రుణ రాయితీ పథకాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం దివ్యాంగులను విస్మరిస్తే, కూటమి ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ గత డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం హామీని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తున్నామన్నారు. నేడు గుంటూరు బస్టాండ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.

ఈ సందర్భంగా తమకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరగా మంత్రి దుర్గేష్ నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *